దర్శకుడు క్రిష్ తన తాజా సినిమా 'మణికర్ణిక'ను చూసి అభినందిస్తోన్నవారికి థ్యాంక్స్ చెప్పాడు సోషల్ మీడియా సాక్షిగా. బాలీవుడ్‌లో క్రిష్ రూపొందించిన సినిమా ఈ 'మణికర్ణిక'. అయితే, ఈ చిత్రానికి క్రిష్ పూర్తిగా దర్శకత్వం 'క్రెడిట్' తీసుకోలేని పరిస్థితి. ఎందుకంటే, ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన కంగనా రనౌత్, కొంత భాగానికి దర్శకత్వం కూడా వహించింది.
క్రిష్, 'ఎన్టీఆర్ బయోపిక్' కోసం హైదరాబాద్‌కి వచ్చేయడంతో, కంగనా రనౌత్ 'మణికర్ణిక' దర్శకత్వ బాధ్యతలు తీసుకుని పూర్తి చేసిన విషయం తెల్సిందే. చాలా మార్పులు కూడా కంగనా చేసేసి, క్రిష్‌కి క్రెడిట్ రానీయకుండా చేయడానికి ప్రయత్నించింది. అయినాగానీ క్రిష్ మాత్రం 'మణికర్ణిక' సినిమా తనదేనని గట్టిగా చెప్పుకున్నాడు. ఆ సంగతులు పక్కన పెడితే, పాపం క్రిష్‌ని సోషల్ మీడియాలో కొందరు 'ఆకతాయిలు' తెగ ఆడేసుకుంటున్నారు. 'నువ్వెందుకు థ్యాంక్స్ చెబుతున్నావు.
నీకసలు ఆ సినిమాకి సంబంధించి ఎలాంటి హక్కులూ లేవు' అనేస్తోంటే పాపం క్రిష్ పరిస్థితి ఎలా వుంటుందో ఊహించుకోగలరా? 'ఎన్టీఆర్ బయోపిక్' కోసం 'మణికర్ణిక'ను వదిలేసుకున్న క్రిష్, బయోపిక్‌లోని మొదటి పార్ట్ 'కథానాయకుడు' ఫెయిల్ అవడంతో డీలాపడ్డాడు. 'మహానాయకుడు' ఎలా వుంటుందో తెలియదు. ఈ గందరగోళంలో 'మణికర్ణిక' వచ్చి క్రిష్‌కి కొత్త తలనొప్పులు తెచ్చింది. నెటిజన్లు ఏమాత్రం జాలి కూడా లేకుండా, మన తెలుగు దర్శకుడన్న గౌరవం కూడా లేకుండా విరుచుకుపడుతుండడం శోచనీయం.