చిత్రసీమలో నమ్మకాలు ఎక్కువ. సెంటిమెంట్లకు కొదవ లేదు. అలానే కృష్ణవిషయంలో చాలా సెంటిమెంట్లు ఉన్నాయి. కృష్ణకు నీటి గండం ఉందని ఇంట్లోవాళ్లు బలంగా నమ్మేవారు. ముఖ్యంగా కృష్ణ మాతృమూర్తి కి ఈ విషయంలో చాలా కంగారు ఉండేది. కృష్ణ ఎప్పుడు షూటింగ్ కి వెళ్లినా `ఈ సినిమాలో నీటిలో తీసే సీన్లు ఏమైనా ఉన్నాయా` అని ఆరా తీసేవారు. అలా.. కృష్ణకు నీటి గండం ఉందన్న విషయం... చిత్రసీమ మొత్తానికి తెలిసిపోయింది.
`జన్మ జన్మల బంధం` అనే సినిమా షూటింగ్ జరుగుతున్న రోజులవి. వాణిశ్రీ హీరోయిన్. అయితే... ఆసినిమా షూటింగ్ సమయంలో కృష్ణ - వాణిశ్రీల మధ్య ఏదో గొడవైంది. ఇద్దరికీ మాటల్లేవు. కెమెరా ముందు నటిస్తున్నారు తప్ప. కట్ చెప్పగానే ఎవరికి వాళ్లు.. విడిపోయి.. చెరో దిక్కుకి వెళ్లిపోతున్నారు. వీళ్ల గొడవ గురించి యూనిట్ సభ్యులందరికీ తెలిసిపోయింది. ఈ సినిమాలోనే నీటిలో ఓ సీన్ ఉంది. వాణిశ్రీ నీటిలో పడి మునిగిపోతుంటే.. కృష్ణ రక్షించాలి. అయితే.. సీన్ ప్రకారం వాణిశ్రీని రక్షించడానికి నీటిలో దూకిన కృష్ణ బ్యాలెన్స్ తప్పారు. ఆయన మునిగిపోతుంటే.. అప్పటికే నీటిలో ఉన్న వాణిశ్రీ... కృష్ణని గట్టిగా పట్టుకొని.. మునిగిపోకుండా అడ్డుకొన్నారు. ఈ ఘటన తరవాత... మళ్లీ కృష్ణ, వాణిశ్రీలు కలిసిపోయారు.
సిరిపురం మొనగాడు అనే సినిమా షూటింగ్‌లోనూ కృష్ణకు ప్రాణాపాయం తప్పింది. ఆ సినిమాలో మందు గుండు పేల్చేసీన్ ఒకటి ఉంది. ఫిరంగిలో మందుగుండు సామాగ్రిని పూరిస్తే... అది పేలాలి. కానీ ఆ మంట.. రివర్స్ లో కృష్ణ వైపునకు దూసుకొచ్చింది. ఆ హఠాత్ పరిణామానికి కృష్ణ స్పృహ తప్పి పడిపోయారు. అదృష్టవశాత్తూ.. కృష్ణకు ఏం కాలేదు.