క్రికెట్‌లో రికార్డులన్నీ సచిన్ టెండూల్కర్‌వే. సినిమాల్లో అయితే... ఆ ఘనత కృష్ణకు దక్కుతుంది. ఆయన అందుకోని రికార్డు లేదు. సృష్టించని చరిత్ర లేదు. తెలుగులో రీమేక్ చిత్రాల్లో ఎక్కువగా నటించిన ఘనత కూడా సూపర్‌స్ట్టార్ కృష్ణదే. ఆయన మొత్తం 54 రీమేక్ చిత్రాల్లో నటించి చరిత్ర సృష్టించారు. ఇందులో హిందీ రీమేక్ చిత్రాలు 17 ఉన్నాయి. బాలీవుడ్ నటుడు, నిర్మాత, దర్శకుడు రాజ్ కపూర్ నటించిన ‘అనాడి’ ఆధారంగా రూపుదిద్దుకున్న ‘అమాయకుడు’ చిత్రంలో హీరో కృష్ణ నటించారు. హిందీలో విజయం సాధించిన ‘వక్ త్’ ఆధారంగా రూపుదిద్దుకున్న ‘భలే అబ్బాయిలు’ చిత్రంలో కృష్ణ, కృష్ణంరాజు, రామ్మోహన్ హీరోలుగా నటించారు. అశోక్ కుమార్, నళినీ జయంత్ కాంబినేషన్‌లో హిందీలో రూపు దిద్దుకున్న ‘మిస్టర్ ఎక్స్’ చిత్రానికి రీమేక్ ‘శభాష్ సత్యం. తెలుగు, మలయాళ భాషల్లో ఒకేసారి తయారైన ఈ చిత్రంలో హీరో కృష్ణ సరసన రాజశ్రీ నటించారు. మోడరన్ థియేటర్స్ నిర్మించిన 110 వ చిత్రం ‘నేనూ మనిషినే’లో హీరో కృష్ణ నటించారు.
హిందీలో జితేంద్ర నటించిన ‘దోబాయ్’ చిత్రానికి రీమేక్ ఇది. కాంచన కథానాయికగా నటించిన ఈ చిత్రం 1971 అక్టోబర్ 16 న విడుదల అయింది. మరాఠీలో రూపు దిద్దుకుని ఆరు అవార్డులు పొందిన ‘అపరాధ్’ చిత్రం ఆధారంగా రూపొందిన ‘గూడు పూటానీ’ చిత్రంలో హీరో కృష్ణ, శుభ జంటగా నటించారు. ఆర్వో కలర్‌లో తీసిన తొలి సినిమా ఇదే. పాపులర్ సాంగ్ ‘తనివి తీరలేదే’ ఈ సినిమా లోదే. విజయా సంస్థలో హీరో కృష్ణ నటించిన తొలి చిత్రం ‘గంగ మంగ’. హిందీలో హిట్ అయిన ‘సీత ఆవుర్ గీత’ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో వాణిశ్రీ ద్విపాత్రాభినయం చేశారు. శోభన్ బాబు మరో హీరోగా నటించారు. 1973 నవంబర్ 30 న విడుదలైన ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. శశి కపూర్, ముంతాజ్ జంటగా రూపొందిన ‘చో ర్ మచాయె షోర్’ చిత్రాన్ని ‘భలే దొంగలు’ పేరుతో తెలుగులో రీమేక్ చేశారు.
కృష్ణ, మంజుల జంటగా నటించిన ఈ చిత్రం లో మరో కీలక పాత్ర పోషించిన మోహన్ బాబుకు చక్కని గుర్తింపు లభించింది. 1976 అక్టోబర్ 29న విడుదలైన ఈ సినిమా హిట్ అయింది. హీరో కృష్ణ బావమరిది సూర్యనారాయణ బాబు నిర్మించిన చిత్రం ‘మనుషులు చేసిన దొంగలు’. ఇందులో కృష్ణంరాజు, కృష్ణ అన్నదమ్ములుగా నటించారు. మంజుల కథానాయిక. హిందీలో హిట్ అయిన హాత్ కి సఫాయి’ చిత్రానికి రీమేక్ ఇది. ఈ చిత్రం 1977 అక్టోబర్ 19 న విడుదల అయింది. హిందీలో విజయవంతమైన ‘ఏక్ సే బడకర్ ఎక్’ చిత్రం ఆధారంగా రూపొందిన చిత్రం ‘ముగ్గురూ ముగ్గురే’. కృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రంలో జయచిత్ర కథానాయిక. సత్యనారాయణ, మోహన్ బాబు మరో రెండు కీలక పాత్రలు పోషించారు. 1978 మే 27 న ఈ సినిమా విడుదలైంది. వినోద్ ఖన్నా, విద్యా సిన్హా జంటగా నటించిన ‘ఇన్ కార్’కు రీమేక్‌గా ‘దొంగల వేట’ చిత్రంలో కృష్ణ, జయప్రద జంటగా నటించారు. 1978 జూలై 14 న విడుదల అయిన ఈ చిత్రం విజయం సాధించింది.