టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి గురించి ఎప్పటికప్పుడు కుప్పలు తెప్పలుగా గుసగుసలు వినిపిస్తాయి. పెళ్లెప్పుడు.? అని ప్రశ్నిస్తే ప్రభాస్ తెగ మొహమాటపడిపోతుంటాడు. అప్పుడే కాదంటాడు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌లా కాకపోయినా, ప్రభాస్ కూడా పెళ్లీడు దాటేశాడు. దాంతో అభిమానులకు సహజంగానే తమ అభిమాన హీరో పెళ్లి గురించి బెంగ ఎక్కువైపోతుంటుంది.
ప్రభాస్ ఎలాగూ సమాధానం చెప్పడు. అందుకే ఈ మధ్య కృష్ణంరాజు ఎక్కడికెళ్లినా ఆయన్ను ప్రభాస్ పెళ్లి గురించి అడుగుతున్నారు అభిమానులు. ఎంతైనా కృష్ణంరాజుకు ప్రభాస్ నట వారసుడు కదా. తాజాగా కృష్ణంరాజు ప్రభాస్ పెళ్లిపై స్పందించారు. 'సాహో' సినిమా రిలీజ్ అయిన వెంటనే ప్రభాస్ పెళ్లి పీటలెక్కుతాడు అన్నారు. అప్పుడు 'బాహుబలి' అన్నారు. ఇప్పుడు 'సాహో' అంటున్నారు. నమ్మొచ్చా.? అని తిరుగు ప్రశ్న కూడా ఎదురైంది కృష్ణంరాజుకు.
దాంతో ఈ సారి పక్కా అని మాటివ్వాల్సి వచ్చింది కృష్ణంరాజు. 'సాహో' రిలీజైన వెంటనే పెళ్లంటే ఆల్రెడీ అమ్మాయి రెడీగా ఉండి ఉండాలి. లేదంటే మళ్లీ ప్రభాస్ నెక్స్ట్ సినిమాకి వెళ్లిపోయే అవకాశాలున్నాయి. 'సాహో' తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమాలో నటించాల్సి ఉంది. పూజా హెగ్దే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.