తెలుగు చిత్రసీమలో తిరుగులేని హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్నాడు అలీ. ఇప్పుడు రాజకీయంగానూ ఎదగాలని చూస్తున్నాడు. తనకున్న క్రేజు చూసి... పార్టీలన్నీ 'రా.. రమ్మని' ఆహ్వానిస్తాయనుకున్నాడు అలీ. కానీ.. అనుకున్నది వేరు, జరుగుతున్నది వేరు. 'నాకు సరైన స్థానం ఇస్తానంటే.. ఏ పార్టీలో చేరడానికైనా సిద్ధమే' అని ప్రకటించినా... ఇప్పటి వరకూ అలీకి ఏ పార్టీ నుంచి ఎలాంటి ఆహ్వానాలూ అందలేదు. ముందు ఆయన జగన్‌తో ములాఖాత్ అయ్యాడు. ఆ తరవాత.. పవన్ కల్యాణ్ దగ్గరకు వెళ్లాడు.
చివర్లో బాబుని కూడా కలిసి 'హలో' చెప్పి వచ్చేశాడు. ఇప్పుడు మరోసారి చంద్రబాబుతో భేటీ అయి పార్టీలో తనకిచ్చే స్థానమేంటి? అని అడిగి వచ్చేశాడు. ఇన్నిసార్లు ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం అనే రేంజులో తిరుగుతున్నా... ఎవ్వరూ అలీని పట్టించుకోవడం లేదేమో అనిపిస్తోంది. అలీ ఉంటే... మన పార్టీకే మంచిది అని ఎవరు అనుకున్నా ఈ పాటికి అలీ ఏదో ఓ పార్టీ కండువా కప్పుకునేవాడే. అయితే అలాంటిదేం జరగలేదు. అలీ షరతులు చూసి.. పార్టీలు కాస్త డైలామాలో పడ్డాయని ఇండ్రస్ట్రీ వర్గాల టాక్.
గుంటూరు 2 నుంచి పోటీ చేయడానికి అలీ సముఖంగా ఉన్నాడు. కానీ అక్కడి నుంచి అలీని దింపడానికి ఏ పార్టీ సముఖంగా లేదని తెలుస్తోంది. మరోవైపు మంత్రి పదవి అనే... డిమాండ్ కూడా అలీ నోటి నుంచి వినిపిస్తోంది. ఆలూ లేదు చులూ లేదు అప్పుడే మంత్రి పదవేంటి? అని పార్టీ పెద్దలు ఆశ్చర్యపోతున్నారంట. అందుకే అలీ ఇప్పటి వరకూ... ఏ పార్టీ కండువా కప్పుకునే అవకాశం లేకుండా పోయిందని ఇండ్రస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.