తెలంగాణా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సర్‌కి రాజకీయాలే కాదు, సినిమాల పైనా ఓ ఐడియా ఉంది. రాజకీయాల నుండి కూసింత టైం దొరికితే చాలు, ఆ టైంలో కొత్తగా ధియేటర్‌లో సందడి చేస్తున్న సినిమాలను చూసేందుకు ఫ్యామిలీతో సహా వెళతారు. అలా కేటీఆర్ తాజాగా రెండు సినిమాలు చూశారు. వాటిలో ఒకటి 'సాహో' కాగా, ఇంకోటి 'ఎవరు'. 'సాహో' విజువల్ వండర్ అని కేటీఆర్ ప్రశంసించారు.
అలాగే, చిన్న సినిమా అయినా 'ఎవరు' కూడా కేటీఆర్‌కి బాగా నచ్చింది. అందుకే ప్రత్యేకంగా ఈ సినిమాని అభినందించారు కేటీఆర్. అడవి శేష్, రెజీనా, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా స్క్రీన్‌ప్లే చాలా బాగుందనీ, ఈ ముగ్గురి పర్‌ఫామెన్స్ సూపర్బ్‌గా ఉందని ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. గతంలో అడవి శేష్ నటించిన 'గూఢచారి' సినిమాని కూడా కేటీఆర్ ప్రశంసించిన సంగతి తెలిసిందే. నిజానికి 'ఎవరు' గతవారం రిలీజైంది. మంచి టాక్ తెచ్చుకుంది.
ఇప్పుడు కేటీఆర్ ప్రశంసలతో 'ఎవరు'కు ఇంకాస్త వెయిట్ వచ్చినట్లైంది. వెంకట్ రాంజీ దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్‌గా 'ఎవరు' తెరకెక్కింది. 'ఎవరు' తర్వాత అడవి శేష్, 'మేజర్' చిత్రంలో నటించనున్నారు. మహేష్ బాబు నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుంది. ఆ తర్వాత 'తన బ్లాక్ బస్టర్ గూఢచారి' సీక్వెల్‌ని అడవి శేష్ పట్టాలెక్కించనున్నారు.