అన్న మాట నిలబెట్టుకున్నాడు. అగ్గి రాజేశాడు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. తెలుగునాట రాజకీయం అంటేనే ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటేనే రాజకీయం.. అనే స్థాయికి స్వర్గీయ నందమూరి తారకరామారావు పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.
విశ్వ విఖ్యాత నట సార్వభౌముడిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న ఆయన రాజకీయాల్లోనూ తిరుగులేని శక్తిగా మన్ననలు అందుకున్నారు. కానీ చివరిరోజుల్లో అత్యంత బాధాకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతీ ఒక్కరూ ఎన్టీఆర్ మీద జాలి ప్రదర్శించేది చివరి రోజుల్లో ఆయన అనుభవించిన నరకం గురించే. దాన్నే కథాంశంగా తీసుకుని రామ్‌గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాని తెరకెక్కించాడు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌లో చాలా పాత్రలున్నాయి. లక్ష్మీపార్వతిని 'ముండ' అని తిట్టిన పాత్ర ఇంకెవరిదో కాదు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులే. తండ్రి ఇంకో మహిళ పొందు కోసం ఆరాటపడుతున్నాడని నిస్సిగ్గుగా భావించిన కొడుకు.. పిల్లనిచ్చిన మామకు ఇంకో కొడుకు పుడితే వాడెక్కడ తనకు మేకులా తయారవుతాడోనని బెంబేలెత్తిపోయే అల్లుడు.. స్త్రీ పురుషుల మధ్య అక్రమ సంబంధాన్ని అంటకట్టే మీడియా.. ఇలా చాలా ఉన్నాయి. పరిస్థితులు ఒక్కసారిగా ఎదురు తిరిగితే, ఎంతటి బలవంతుడైనా పతనానికి చేరువవక తప్పదని ఎన్టీఆర్ జీవిత చరిత్ర చెబుతుంది.
ఆ చరిత్రను తెరకెక్కించడం ద్వారా ఎవరికి ఎక్కడ ఎంతలా కాలాలో అంతలా కాలిపోయేలా మంట పెట్టాడు రామ్‌గోపాల్ వర్మ. మంట పెట్టాడు, ఇప్పుడా మంటల సెగకి ఎదురు తిరిగేదెవరు.? ఎవరికీ తెలియకుండా ఇంటికెళ్లి బర్నాల్ రాసుకునేదెవరు.? వేచి చూడాల్సిందే.