నవ్వుల పాలైన 'లక్ష్మీస్‌ వీరగ్రంధం'.!

మరిన్ని వార్తలు

ఓ పక్క ఎన్టీఆర్‌ బయోపిక్స్‌ అంటూ 'కథానాయకుడు', 'మహానాయకుడు' భారీ అంచనాలు నమోదు చేసి, విడుదలయ్యాక తుస్సుమనిపించగా, మరోవైపు రామ్‌గోపాల్‌ వర్మ 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' అంటూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉండగా, రేస్‌లో నేను కూడా ఉన్నానంటూ అప్పుడెప్పుడో బాలయ్యకూ, రామ్‌గోపాల్‌ వర్మకూ పోటీగా తన సినిమాని అనౌన్స్‌ చేసిన కేతిరెడ్డి జగదీశ్వరెడ్డి వెర్షన్‌ ఎన్టీఆర్‌ బయోపిక్‌ 'లక్ష్మీస్‌ వీరగ్రంధం' తాజాగా తెరపైకి వచ్చింది. వస్తూ వస్తూనే ఏకంగా ఈయన ట్రైలర్‌తో వచ్చేశాడు. అయితే ట్రైలర్‌ వచ్చిందంటే చాలు సినిమాపై దాదాపు ఓ అంచనాకి వచ్చేయచ్చన్న అభిప్రాయంతో ఉంటారు ప్రేక్షకులు. 

 

కానీ కేతిరెడ్డిగారు తన ట్రైలర్‌లో ఏం చూపించారంటే అందరికీ మిలియన్‌ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది. బాలయ్య చూపించిన వెర్షన్‌లో ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా కూల్‌గా ఎన్టీఆర్‌ సినీ, రాజకీయ ప్రస్థానాన్ని చూపించేస్తే, వర్మ తనదైన శైలి కాంట్రవర్సీతో 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' ప్రచార చిత్రాల్ని బయటికి వదిలి సినిమాపై అంచనాల్ని పెంచేశాడు. ఇదిలా ఉంటే, ఎన్టీఆర్‌ జీవితంలోకి ప్రవేశించక ముందు లక్ష్మీపార్వతి ఏంటీ.? అనే అంశంపై తన వెర్షన్‌ ఉండబోతోందని ప్రచారం చేసుకున్న కేతిరెడ్డిగారు, విడుదల చేసిన 'లక్ష్మీస్‌ వీరగ్రంధం' ట్రైలర్‌కి సరికొత్త ఫ్లేవర్‌ యాడ్‌ చేసినట్లున్నారు. ట్రైలర్‌కి హారర్‌ టచ్‌ ఇచ్చారు. 

 

ఓ స్త్రీ పాత్రధారి ఇంట్లోకి అడుగుపెడుతున్న వైనం.. ఇంట్లోని దీపాలు ఆరిపోవడం, గోడలు బీటలు వారడం, గడపకు కరెంట్‌ షాక్‌ ఎఫెక్ట్‌లు, గాలిలో రాబందు ఎగరడం.. ఇలాంటివన్నీ హారర్‌ మూవీస్‌లోనే కదా చూస్తాం. కట్‌ చేస్తే అవే ఎఫెక్టులు ఈ ట్రైలర్‌లోనూ చూపించారు. కానీ పాత్రలకు సంబంధించి ఏ ఒక్కరి ముఖాన్నీ చూపించకుండా డైరెక్టర్‌ ఏదో పెద్ద బిల్డప్‌ ఇచ్చేశారు కానీ ఈ ట్రైలర్‌కి సోషల్‌ మీడియాలో వస్తున్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS