తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ కార్యకర్త 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదలను ఆపేయాలి.. అని ఎన్నికల కమీషన్‌కి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి విషయాన్ని తెలియజేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఇప్పుడు ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంది.
సినిమాలో చంద్రబాబును విలన్‌గా చూపించారనీ, అది రాబోయే ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందనీ, సో పోలింగ్ అయ్యేంతవరకూ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' రిలీజ్ చేయవద్దనీ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 'ఎన్టీఆర్' బయోపిక్ అంటూ రెండు పార్ట్‌లుగా తెరకెక్కిన 'కథానాయకుడు', 'మహానాయకుడు' చిత్రాలు వరుసగా ఫెయిల్యూర్ కావడంతో వర్మ తెరకెక్కిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలు ఆడియన్స్‌లో ఉత్కంఠ రేకెత్తించాయి. ఈ క్రమంలో మార్చి 22న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు రామ్ గోపాల్ వర్మ. అయితే అనుకోకుండా, తాజాగా ఎన్నికల కమీషన్ పోలింగ్ డేట్ ఫిక్స్ చేయడంతో పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న సినిమాలు ఇరకాటంలో పడ్డాయి. సీనియర్ హీరో రాజశేఖర్ 'అర్జున' సినిమా ఆల్రెడీ వాయిదా పడింది. మరి తాజా ఫిర్యాదుతో వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదల కూడా వాయిదా పడుతుందా.? వేచి చూడాలిక.