ఆ రోజుల్లో ఎన్టీఆర్, సూర్యకాంతం ఇద్దరూ ఇద్దరే. పోటీపడి నటించి అభిమానుల్ని ఉర్రూతలూగించారు. గయ్యాలీ పాత్రలతో సూర్యకాంతం గారికి ఎందరో అభిమానులున్నారు. గయ్యాలీ అంటే గుర్తొచ్చేది ముందుగా ఆమె పేరే మరి. అంతేకాదు, ఎన్నో మనసును హత్తుకునే పాత్రల్లోనూ నటించి మెప్పించారామె. ఇక అన్నగారు ఎన్టీఆర్ సంగతి చెప్పనే అక్కర్లేదు. లెజెండ్స్‌గా చెప్పుకోవడానికి అన్ని అర్హతలు ఉన్న నటీ, నటులు వీరిద్దరూ.
ఈ మ్యాటర్ ఇప్పుడెందుంటే, ఈ వారం బాక్సాఫీస్ బరిలో ఎన్టీఆర్, సూర్యకాంతం పోటా పోటీగా బరిలోకి దిగుతున్నారు. అదేనండీ వర్మ తెరకెక్కిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఓ పక్క, మెగా డాటర్ లీడ్ రోల్ పోషిస్తోన్న 'సూర్యకాంతం' ఇంకో పక్క. వాస్తవానికి పోటీ లేకుండా ఈ వారం 'సూర్యకాంతం'గా మెగా డాటర్ ఒక్కరే సోలో ఎంట్రీ ఇస్తుందని భావించారంతా. అయితే అనూహ్యంగా వివాదాల్నీ, కోర్టు కేసుల్నీ, సెన్సార్ కట్స్‌నీ దాటుకుని వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' బరిలోకి వచ్చేసింది. సో సూర్యకాంతానికి బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ కుదిరింది. వివాదాలతో, ప్రచార చిత్రాలతో అన్నగారి అభిమానుల దృష్టిని 'లక్ష్మీస్ ఎన్టీఆర్' వైపు మళ్లించి ఉంచాడు రామ్‌గోపాల్ వర్మ.
తొలి రెండు సినిమాల్లోనూ డల్‌గా కనిపించి, అభిమానుల్ని ఆకట్టుకోలేకపోయిన నిహారిక 'సూర్యకాంతం'తో ఓ మోస్తరు అంచనాల్ని క్రియేట్ చేసింది. ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనింగ్ క్యారెక్టర్‌లో నిహారిక కనిపిస్తోంది ఈ సినిమాలో. ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో మండు వేసవిలో లస్సీలాంటి చల్లని ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారికీ, అప్పుడే ఎగ్జామ్స్ పూర్తి చేసి, ఆ టెన్షన్స్ నుండి రిలీఫ్ కోరుకునే స్టూడెంట్స్‌కి మజా ఇచ్చేందుకు ఈ వారం 'సూర్యకాంతం' కలర్‌ఫుల్‌గా రెడీ అయిపోయింది. ఎన్టీఆర్, సూర్యకాంతం.. మరి ఎవరికెక్కువ ఓపెనింగ్స్ వస్తాయో చూడాలంటే 29 వరకూ వేచి చూడాల్సిందే.