సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా మార్చి 22 న విడుదలకు సిద్ధమవుతోంది. మొదటి నుండి వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఈ సినిమా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఉండబోతోందని ప్రచారం జరుగుతుంది. అందుకు అనుగుణంగానే, ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు, ట్రైలర్ వీడియోలతో ఆ విషయం స్పష్టమైపోయింది. దాంతో.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలో ఒకరు ఈ సినిమా విడుదలను ఆపాలని భారత ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
అయితే.. ECI ఇప్పటి వరకూ ఈ చిత్రంపై ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఇంతలో.. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' నుండి వెన్నుపోటుకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిలో కొన్ని దృశ్యాలు కొత్తగా కనిపించగా.. మరికొన్ని అధికారికంగా విడుదలైన ప్రోమోలలో చూసినవే. దాంతో.. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదలకు ముందే లీక్ అయ్యిందా? అనే ప్రశ్న నెటిజన్స్ లో వైరల్ గా మారింది.
ఎన్టీఆర్ జీవితం చివర్లో దెబ్బతినటానికి కారణమైన వైశ్రాయ్ హోటల్ ఎపిసోడ్, ఈ సినిమాలో కీలకంగా చెప్పుకోవచ్చు. ఇదంతా.. అప్పట్లో చంద్రబాబు నాయుడు చేయించిన పనిగా మనం చెప్పుకోవచ్చు. ఈ సంఘటనని ఆధారంగా తీసుకుని మరికొన్ని ప్రధాన అంశాలను జోడించి రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాని రూపొందించారు. ఆ భయంతోనే టీడీపీ కార్యకర్తలు ఈ సినిమాకు వ్యతిరేకంగా ECI ను సంప్రదించారు. ఏదిఏమైనా, 'లక్ష్మీస్ ఎన్టీఆర్' లీకేజ్ గురించి వర్మ నోరు మెదిపితే తప్ప మనం ఒక క్లారిటీకి రాలేము.