కరోనా వల్ల వినోదాలన్నీ బంద్ అయ్యాయి. థియేటర్లు ఎప్పుడో మూసేశారు. ఇల్లు కదిలి బయటకు రాలేని పరిస్థితి. ఇప్పుడు టీవీలే సినిమా తెరలుగా మారిపోయాయి. ఓటీటీ వేదికలు ఉండడం వల్ల - కొత్త సినిమాలూ, వెబ్ సిరీస్‌లూ ఫ్రీగా, ఇంటి పట్టునే ఉండి చూసే అవకాశం దక్కుతోంది. సినిమాల మాటెలా ఉన్నా, ఇప్పుడు వెబ్ సిరీస్‌లకు మంచి గిరాకీ ఏర్పడింది. కరోనా ఎఫెక్ట్ తరవాత వెబ్ సిరీస్‌లను చూసేవాళ్ల సంఖ్య ఎక్కువవుతోంది. అమేజాన్, నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓటీటీ వేదికలలో ఉన్న వెబ్ సిరీస్‌లు ఇప్పటికే చాలా పాపులర్ అయిపోయాయి.
ఇప్పుడు జీ 5, వూట్, ఆహా వెబ్ సిరీస్‌లపై పడ్డారు సినీ అభిమానులు. ఆయా వెబ్ సిరీస్ లలో రేటింగులు లేక, వ్యూవర్ షిప్ లేక డీలా పడిన వెబ్ సిరీస్‌లు ఇప్పుడు అనూహ్యంగా పుంజుకుంటున్నాయి. `ఏ చెట్టూ లేని చోట ఆముద వృక్షమే మహా వృక్షం` అయినట్టు... కొన్ని వెబ్ సిరీస్‌లు మంచి వ్యూవర్ షిప్‌ని సాధిస్తున్నాయి. నిజానికి వెబ్ సిరీస్‌లు చూసేవాళ్లలో యువతరమే ఎక్కువ. ఇప్పుడు టీవీలో సీరియళ్లు కూడా బందవ్వడంతో - ఇంట్లోవాళ్లకూ వెబ్ సిరీస్‌లే దిక్కయ్యాయి. వాళ్లూ మెల్లమెల్లగా వెబ్ సిరీస్‌లకు అలవాటు పడుతున్నారు. షెడ్యూల్ ప్రకారం ఎప్పుడో మే, జూన్‌లలో విడుదల చేయాల్సిన కొత్త సిరీస్‌లను కూడా... ఓటీటీ వేదికలు ఇప్పుడే తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. పాత వెబ్ సిరీస్ లకు ఆన్ లైన్ వేదికలపై ప్రచారం కల్పించడం ద్వారా వీక్షకుల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇటీవల కాలంలో సబ్‌స్క్రైబర్స్ కూడా భారీగా పెరగడంతో.. ఓటీటీ వేదికలకు ఆర్థిక పరిపుష్టి లభిస్తోంది.