రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన 'తొలిప్రేమ' చిత్రంతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన మెగా రాకుమారుడు వరుణ్ తేజ్ తాజాగా ఓ ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రయోగాలు మెగాప్రిన్స్‌కి కొత్తేమీ కాదు. కానీ లవ్‌స్టోరీస్ అయిన 'ఫిదా', 'తొలిప్రేమ' సినిమాలు వరుణ్‌కి కలెక్షన్స్ పరంగా స్టామినాని పెంచాయి. అయితే హీరోగా తానేంటి అనేది నిరూపించుకోవాలనుకుంటుంటాడు వరుణ్ తేజ్.
అందుకే వరుసగా రెండు బ్లాక్ బస్టర్స్ కొట్టిన తర్వాత మళ్లీ ఓ ప్రయోగానికి సై అన్నాడు. 'ఘాజీ' చిత్రంతో పరచయమైన యంగ్ దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఈ ప్రయోగానికి తెర లేపుతున్నాడు. వరుణ్‌లాగే సంకల్ప్ కూడా డిఫరెంట్‌గా ఆలోచించే తత్వం ఉన్నోడు. అందుకే ఈ ఇద్దరికీ సెట్ అయ్యింది. ఈ ఇద్దరి కలయికలో స్పేస్ నేపథ్యంలో ఓ సినిమా రాబోతోంది. ఈ సినిమాలో ఏస్ట్రోనాట్‌గా కనిపించబోతున్నాడు వరుణ్ తేజ్. అందుకోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ సినిమాలో వరుణ్‌తో జోడీ కట్టేందుకు ఆల్రెడీ ముద్దుగుమ్మ అదితీరావ్ హైదరిని ఎంచుకున్నారు.
తాజాగా ఈ ప్రాజెక్ట్‌లోకి మరో ముద్దుగుమ్మ ఎంట్రీ ఇస్తోంది. ఆమె ఎవరో కాదు, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి. 'భలే భలే మగాడివోయ్', 'సోగ్గాడు' చిత్రాలతో వరుస హిట్లు అందుకున్న ఈ బ్యూటీకి ప్రస్తుతం ఏదీ కలసి రావడం లేదు. అంతెందుకు వరుణ్‌తో చేసిన 'మిస్టర్' కూడా దెబ్బ కొట్టింది. అలాంటిది ఈ సినిమా కోసం ఈ బ్యూటీని ఎందుకు ఎంచుకున్నారంటే అది పాత్ర వెయిట్‌ని బట్టే అంటున్నారు. ఓ కీలక పాత్ర కోసం లావణ్యని ఏరి కోరి ఎంచుకున్నారనీ తెలుస్తోంది. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే అమ్మడి పంట పండినట్లే మరి.