'లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ '... అంటే ఓ విశిష్టమైన పురస్కారం. జీవితం మొత్తం చిత్రసీమకు త్యాగం చేసినవాళ్లని, అరుదైన నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని ఈ పురస్కారం కోసం ఎంపిక చేస్తుంటారు. 'అంతా సాధించేశారు' అనడానికి గుర్తుగా ఈ అవార్డు ఇస్తుంటారు. కాకపోతే ఇప్పుడు కొన్ని ప్రైవేటు సంస్థలు ఇలాంటి పురస్కారాల్ని ఎవరికి పడితేవాళ్లకు అందిస్తూ.. 'లైఫ్ టైమ్' హోదాని తగ్గించేస్తున్నాయేమో అనిపిస్తోంది.
తాజాగా టి.సుబ్బిరామిరెడ్డి కళాపరిషత్ నగ్మాకి 'లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్' అవార్డు ప్రకటించింది. ఈ అవార్డు ఆమెకు ఎందుకు ఇచ్చారు? అసలు అంత అర్హత ఆమెకు ఉందా? అనే విషయం పక్కన పెడితే ఈ అవార్డు విషయంలో సెటైర్లు మొదలయ్యాయి. ఎందుకంటే అవార్డు కమిటీలో నగ్మా కూడా ఉంది. తనకు తానే అవార్డు ఇచ్చుకుందా? అని జనాలు మాట్లాడుకుంటున్నారు. నగ్మా కేవలం గ్లామర్ కథానాయిక మాత్రమే. నటిగా నగ్మా సాధించిన అవార్డులంటూ లేవు. అలాంటప్పుడు నగ్మాకి ఎలా ఇస్తారు?
శ్రీదేవి, జయప్రద, జయసుధ కంటే నగ్మా పెద్ద నటి అనుకోవాలా? అంతెందుకు రమ్యకృష్ణ కంటే నగ్మా ఎందులో గొప్ప..? అవార్డులు ఎవరికి ఇవ్వాలి అనేది సుబ్బిరామిరెడ్డి సొంత నిర్ణయం కావొచ్చు. ఆయనకు ఇష్టమైన వ్యక్తులకు అవార్డులు ఇచ్చుకోవడంలో తప్పేంలేదు. కాకపోతే.. అర్హులకే ఇస్తున్నాం- ఓటింగ్ ద్వారా అవార్డు విజేతల్ని ఎంచుకున్నాం అన్నప్పుడు - ఆ ఎంపికలో పారదర్శకత ఉండాలి. లేదంటే ఇలానే అవార్డు ప్రక్రియ కూడా ఓ 'జోక్'గా మారిపోతుంది.