'థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ' అనే డైలాగ్‌ని ఇంటి పేరుగా మార్చేసుకున్న కమెడియన్ పృధ్వీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పదవి దక్కించుకున్నాడు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్, రాష్ట్ర కార్యదర్శిగా పృధ్వీకి అవకాశం కల్పించడంతో ఇక నుంచి పృధ్వీ రాజకీయాల్లో తన సత్తా చాటుతాడని అందరూ అనుకుంటున్నారు. ఎగ్రెసివ్ నేచర్ కారణంగా పృధ్వీ మొదట్లో కొన్ని అవకాశాల్ని కోల్పోయాడు సినీ రంగంలో. కానీ, అతనిలో టాలెంట్ అతన్ని కమెడియన్‌గా ఉన్నత స్థానంలో నిలబెట్టింది.
ఈ మధ్య చాలా సినిమాల్లో పృధ్వీ కామెడీ హైలైట్ అవడమే కాదు, అతని కోసం సెపరేట్‌గా కామెడీ ట్రాక్స్ రాయడానికి రైటర్స్ ఆసక్తి చూపుతున్నారు. ఈ టైమ్‌లో ప్రత్యక్ష రాజకీయాలపై పృధ్వీ పోకస్ పెట్టడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎన్నికల సీజన్ కాబట్టి పృధ్వీ వాగ్ధాటిని ఉపయోగించుకోవాలని వైఎస్సార్సీపీ భావించిందనీ, దాని వల్ల పృధ్వీ సినిమా కెరీర్‌కి పెద్దగా ఇబ్బంది వుండదని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పదమూడు జిల్లాల్లోనూ పృధ్వీ రాజకీయ పర్యటనలు చేస్తాడట. పదవి గురించి పృధ్వీకి ముందే సమాచారం వుందనీ, దాంతో ఆ పదవిలో ఎలా వ్యవహరించాలన్నదానిపై ఆయన పూర్తి సన్నద్ధంగా వున్నాడనీ ఈయన సన్నిహితులు చెబుతున్నారు. సినీ ప్రముఖులు రాజకీయాల్లో రాణించడం కొత్త కాదు. ఇప్పటికీ సినీ పరిశ్రమ నుంచి చాలామంది రాజకీయాల్లో వున్నారు. వారందరిలోకీ తాను ప్రత్యేకం అని పృధ్వీ నిరూపించుకుంటాడా? వేచి చూడాల్సిందే.