ఓ టీ టీ నుంచి. పైరసీ నుంచి థియేటర్లు గట్టి పోటీ ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడైతే కరోనా వచ్చింది గానీ, ఇది వరకు కూడా... ఓటీటీ సమస్య సినిమాకు గట్టిగానే ఉంది. సినిమా విడుదలైన నెల రోజులకే ఓటీటీలో దర్శనమివ్వడంతో - థియేటర్లకు వెళ్లడం బాగా తగ్గించేశారు జనాలు. దానికి తోడు పైరసీ కూడా యదేచ్ఛగా దొరికేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల్ని మళ్లీ థియేటర్లకు రప్పించడం ఎలా? అనే విషయంపై.. చిత్రసీమంతా మల్లగుల్లాలు పడుతోంది.
మళ్లీ థియేటర్లకు క్రేజ్ పెరగడానికి ఎవరికితోచిన ఐడియాలు వాళ్లు ఇస్తున్నారు నాగ అశ్విన్, రానా, సురేష్‌బాబు త్రయానికి ఓ మహత్తరమైన ఐడియా వచ్చింది. అదేంటంటే.. థియేటర్లలో లిక్కరు అందుబాటులోకి తెస్తే.. ఎలా ఉంటుందని. బీర్, బ్రీజర్, వైన్... ఈ మూడూ థియేటర్లలో అమ్మకానికి ఉంచితే, ప్రేక్షకుల సంఖ్య పెంచుకోవొచ్చన్నది వాళ్లకొచ్చిన ఆలోచన. అంటే.. ఇంట్రవెల్‌లో పాప్ కార్న్, కూల్ డ్రింక్ కొనుక్కున్నట్టు సరదాగా బీరో, వైనో కొనుక్కుని తాగొచ్చన్నమాట. నిజానికి కొన్ని దేశాల్లో ఈ పద్ధతి అమలులో ఉంది. దాన్ని మన దేశంలోనూ తీసుకొస్తే.. థియేటర్ల ఆక్యుపెన్సీ పెంచుకోవచ్చన్నది వాళ్ల ఆలోచన.
అయితే జనాల నుంచి రియాక్షన్లు మాత్రం వేరుగా వస్తున్నాయి. అలా చేస్తే - సినిమాలకు వచ్చే కుటుంబ ప్రేక్షకుల సంఖ్య బాగా తగ్గిపోతుందని, మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. దాని బదులుగా టికెట్టు రేటు తగ్గిస్తే కచ్చితంగా థియేటర్లకు జనాలొస్తారని చెబుతున్నారు. ఇంకొంతమంది కనీసం మల్టీప్లెక్సులలోనైనా `మందు` అందుబాటులోకి తెస్తే ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. నిజానికి ఇదో ప్రమాదకరమైన ఐడియా. థియేటర్లను బార్లుగా మార్చేసే ఆలోచన. సినిమా అనేది వినోద సాధనం. పైగా చౌకగా లభిస్తుంది. ఓ మధ్యతరగతి కుటుంబం వారాంతంలో సరదాగా సినిమాకి వెళ్లడం - గొప్ప కాలక్షేపం అనుకుంటారు. ఇలా అక్కడ కూడా తాగుబోతులు కనిపిస్తే.. సినిమాలకు వెళ్లే వాళ్ల సంఖ్య మరింత తగ్గిపోయే ప్రమాదం ఉంది.