ఎమ్.ఎస్.రాజు... తెలుగు సినిమాలకు ఈయన ఓ బ్రాండ్ గా ఉండేవారు. చిన్న హీరోలతో హిట్లు. స్టార్ హీరోలతో సూపర్ హిట్లు, ప్రయోగాలు... వీటన్నింటికీ కేరాఫ్ అడ్రస్. అయితే దర్శకుడిగా మారాక.. అన్నీ ఫ్లాపులే. దాంతో పాటు నిర్మాతగానూ నష్టపోయారు. దానికి తగ్గట్టే.. ఎం.ఎస్.రాజు బ్రాండ్ వాల్యూ పడిపోయింది. ఇప్పుడు ఆయన నుంచి `దర్టీ హరి` అనే సినిమా వస్తోంది. దర్శకుడు, నిర్మాత కూడా ఆయనే. టీజర్, ట్రైలర్, పోస్టర్ ఏం చూసినా సరే, `దర్టీ` ఫీలింగే వస్తోంది. ఎం.ఎస్.రాజు నుంచి బూతు సినిమా వస్తోందంటూ ప్రచారం మొదలైంది. చివరికి మనసంతా నువ్వే లాంటి క్లాసిక్ తీసిన ఎం.ఎస్.రాజు కూడా... డబ్బుల కోసం బూతుని నమ్ముకోవాల్సివస్తోందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే.. ఎం.ఎస్.రాజు మాత్రం ఇది బూతు సినిమా అంటే ఒప్పుకోవడం లేదు. బూతుకీ, శృంగారానికీ చాలా తేడా ఉందని, తానెప్పుడూ దిగజారిపోయి బూతు సినిమాలు చేయనని, దర్టీ హరి చూశాక.. ఇది బూతు సినిమా అని ఎవరూ అనరని, ఇది తన ఓపెన్ ఛాలెంజ్ అని క్లారిటీ ఇచ్చారు. బూతు సినిమాలు తీస్తే తప్ప, జనాలు చూడరన్న అపనమ్మకంతో తానెప్పుడూ లేనని, తన బ్రాండ్ కి ఎలాంటి నష్టమూ లేకుండా ఈసినిమా తీశానని... ఈ సినిమా చూశాకే ఓ అభిప్రాయానికి రావాలని ఆయన కోరుతున్నారు. ఈనెల 18న ఫ్రైడే మూవీస్ ఏటీటీలో ఈ సినిమా విడుదల కానుంది.