'మా' ఎన్నికలు ముగిశాయి. కొత్త అధ్యక్షుడు ఎవరో తేలిపోయింది. అయినా సరే.. వాళ్ల మధ్య విబేధాలు మాత్రం తగ్గలేదు. 'మా'లో మళ్లీ కుర్చీలాట మొదలైపోయింది. ఈ ఎన్నికలలో నరేష్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈనెల 22న ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని సినీ పెద్దలందరికీ చెప్పారు. తలసాని ని అతిథిగా ఆహ్వాచించారు. అయితే.. ఇక్కడే మా మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా.. తిరకాసు పెట్టారు. తన పదవీ కాలం ఈనెల 31 వరకూ ఉందని, ఈలోగా ఎవరూ తన కుర్చీలో కూర్చోకూడదని, అలా ఎవరైనా ప్రయత్నిస్తే కోర్టుకు వెళ్తానని హెచ్చరించారు.
దాంతో నరేష్ మరోసారి మీడియా ముందుకు రావాల్సివ చ్చింది. ‘‘మమ్మల్ని మా పనిచేసుకోనీయకుండా వెనక్కి లాగుతున్నారు. చిత్ర పరిశ్రమలోని పెద్దల అంగీకారంతో వారి సమక్షంలో ఈ 22న మంచి ముహూర్తం ఖరారు చేసుకొని ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకున్నాం. 'నా పదవీకాలం 31వ తేదీ వరకు ఉంది అప్పటి వరకు ఎవరూ మా కుర్చీలో కూర్చో వద్దు' అని శివాజీ రాజా చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు.. మేము చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. పెద్దలు ఎలా చెప్తే అలా చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం" అని నరేష్ అన్నారు. మరి శివాజీ రాజా రియాక్షన్ ఏమిటో? సినిమా పెద్దలు ఈ వ్యవహారాన్ని ఎలా చెక్కబెడతారో చూడాలి.