గత వారం రోజులుగా టాలీవుడ్ లో 'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల సందర్బంగా వివాదాలు తలెత్తాయి. అటు శివాజీ రాజా.. ఇటు నరేష్ ఇద్దరూ హోరా హోరీగా మాటలతో పోటీ పడ్డారు. తమ మద్దతు కోసం పలు స్టార్ హీరోలను కూడా కలిశారు. దాంతో.. 'మా' ఎలక్షన్స్ పై ఎన్నడూ లేనంత ఉత్కంఠ ఏర్పడింది. గత ఎన్నికల్లో శివాజీ రాజా ఎటువంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఈ సారి మాత్రం నరేష్ కూడా ఎన్నికల బరిలో దిగడంతో ఎవరు గెలుస్తారు అనే ఆశక్తి అందరిలో నెలకొంది. అయితే చివరికి అధ్యక్ష పదవి సీనియర్ నటుడు నరేష్ ని వరించింది.
అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎన్నికల్లో శివాజీ రాజా ఓడిపోవడానికి గల కారణాలు ఏంటా.. అని పరిశీలిస్తే మొదట నాగబాబు పేరే వినిపిస్తుంది. ఎలక్షన్స్ కి రెండు రోజుల ముందు నాగబాబు ఓ ప్రెస్ మీట్ లో నరేష్ ప్యానెల్ కే తమ మద్ధతు ప్రకటిస్తానని తెలియచేసారు. గతంలో శ్రీరెడ్డి- పవన్ కళ్యాణ్ వివాద సమయంలో 'మా' ప్రెసిడెంట్ వైపు నుంచి సరైన స్పందన రాకపోవటంతో చాలా అసంతృప్తి చెందాను అంటూ పరోక్షంగా చెప్పారు. పైగా చాలా మంది కొత్త సభ్యులు నరేష్ ప్యానెల్ లో ఉండడంతో తన సపోర్ట్ నరేష్, జీవిత రాజశేఖర్ లకి ఇస్తున్నట్టు తెలియజేయడం శివాజీ రాజా ఓటమికి మెదటి కారణం అనుకోవచ్చు.
దీంతో నాగబాబు సపోర్ట్ తో పాటు మెగా ఫ్యామిలీ సపోర్ట్ కూడా నరేష్ కే ఇచ్చినట్లయింది. అంతే కాకుండా గతంలో శ్రీరెడ్డి పలువురు సినీ నటులపై వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. అంతేకాకుండా.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ముందు అర్ధ నగ్న ప్రదర్శనతో శ్రీరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అలాంటి సమయంలో అధికారంలో ఉండి కూడా శివాజీ రాజా సరైన నిర్ణయాలు తీసుకోకపోవటం మరో కారణంగా చెప్పుకోవచ్చు.
చివరిగా నరేష్ ప్యానెల్ లో జీవిత మరియు రాజశేఖర్ ఉండటం, ఈసారి జరిగిన ఎలక్షన్స్ లో ఎక్కువ ఓటింగ్ నమోదు అవ్వడం కూడా శివాజీ రాజా ఓటమికి గల కారణంగా చెప్పొచ్చు. అయితే.. విజేత ఎవరైనా అందరం కలిసి పనిచేస్తామని రెండు పానెల్స్ సభ్యులు చెప్పడం విశేషం. ఎవరు గెలిచినా.. ఎవరు ఓడినా.. అందరూ కలిసి కట్టుగా ఉంటూ 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' అభివృద్ధిలో పాలుపంచుకోవాలని ఎన్నికల ఫలితాల ముందే మెగాస్టార్ చిరంజీవి కూడా చెప్పారు. సో.. గెలుపు ఓటముల ప్రస్తావన లేకుండా మా సభ్యులందరూ కలిసికట్టుగా ఉండాలని మనం కూడా ఆశిద్దాం.