మాధవన్‌లో ఓ మంచి దర్శకుడు ఉన్నాడన్న సంగతి `రాకెట్రీ` తో సినీ జనాలకు తెలిసొచ్చింది. మాధవన్ దర్శకత్వంలో రూపొందిన `రాకెట్రీ`కి దేశ వ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. అయితే.. ఈ సినిమా కోసం మాధవన్ తన సొంత ఇంటిని అమ్ముకోవాల్సివచ్చిందని చెన్నై వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి ప్రశంసలైతే వచ్చాయి గానీ, డబ్బులు రాలేదని, అందుకే మాధవన్ అప్పుల్లో కూరుకుపోయాడని, తన ఇల్లు అమ్మి అప్పులు తీర్చాల్సివచ్చిందని టాక్.
అయితే దీనిపై మాధవన్ క్లారిటీ ఇచ్చాడు. తను ఇల్లు అమ్మేశాననడంలో ఎలాంటి నిజం లేదని, ఇప్పటికీ ఆ ఇంట్లోనే ఉంటున్నానని, `రాకెట్రీ`తో ఎవరూ నష్టపోలేదని, ఈ సినిమాతో సంబంధం ఉన్నవాళ్లంతా మంచి డబ్బులు చవి చూశారని, వాళ్లు ఈ యేడాది భారీ మొత్తంలో ఆదాయపు పన్ను కూడా చెల్లించబోతున్నారని, ఈ సినిమా మంచి లాభాల్ని ఆర్జించిందని మాధవన్ క్లారిటీ ఇచ్చాడు. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే.
ప్రముఖ నటులు సూర్య, షారుక్‌ఖాన్ అతిథి పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకి రూ.25 కోట్లు ఖర్చయ్యాయని టాక్. థియేటర్ల నుంచి సొమ్ము రాలేదు గానీ, ఓటీటీ, శాటిలైట్, డిజిటల్ రైట్స్ ద్వారా దాదాపుగా రూ.50 కోట్లు వచ్చాయని తెలుస్తోంది. సో... మాధవన్‌కి రూ.25 కోట్లు లాభమే అన్నమాట.