నటి మాధవీలత తాజాగా బీజేపీ తీర్ధం పుచ్చుకుంది. నటిగా మాధవీలత కెరీర్‌లో 'నచ్చావులే', స్నేహితుడా' సినిమాలు చెప్పుకోదగ్గ సినిమాలు, తప్ప పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేవు. ఈ మధ్య శ్రీరెడ్డి ఇష్యూ, కాస్టింగ్ కౌచ్ అంశాల నిమిత్తం ఈమె పేరు బయటికి వచ్చింది.
తాజాగా రాజకీయ రంగప్రవేశం చేసింది. అయితే సినీ పరిశ్రమకు చెందిన మహిళ కాబట్టి, అందులోనూ పవన్ అంటే అభిమానం అంటోంది కాబట్టి, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరితే బావుండేదని కొందరు భావించారు. కానీ ఈమె మాత్రం బీజేపీలో చేరింది. పార్టీ పరంగా బీజేపీలో చేరినప్పటికీ, తనకి పవన్ కళ్యాణ్‌పై అభిమానం తగ్గలేదంటోంది. అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ పవన్ కల్యాణ్ అంటే అభిమానమే అంటోంది.
మొన్న శ్రీరెడ్డి, పవన్ కళ్యాణ్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఫిల్మ్ ఛాంబర్ వద్ద మాధవీలత మౌన పోరాటం చేసిన సంగతి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ గురించి కూడా కొంచెం గట్టిగానే మాట్లాడింది. ఇకపోతే రాబోయే ఎలక్షన్స్‌లో మాధవీలతను పవన్ కళ్యాణ్‌పై అస్త్రంగా ఉపయోగించే యోచనలో బీజేపీ పార్టీ ఉందని తెలుస్తోంది. అయితే పవన్ అంటే అభిమానం అంటోన్న మాధవీలత ఆ పని చేస్తుందా? రాజకీయాల్లోకి వెళ్లాక అభిమానాలు, ప్రేమలు, సినీ వ్యక్తులు, ఇతర వ్యక్తులు, తన, పర అనే తారతమ్యాలుండవు.
అలాంటి తరుణంలో మాధవీలత తన రాజకీయ కెరీర్‌ను ఎలా కాపాడుకోగలుగుతుంది. అక్కడ తన ఉనికిని ఎలా చాటుకుంటుందో చూడాలిక.