సావిత్రి జీవిత ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'మహానటి'. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించి తెరకెక్కించారు. రేపే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సావిత్రి జీవితం తెరచిన పుస్తకం. చాలా మంది ఆమె జీవితంలోని పలు ఘట్టాలను ఎంచుకుని పుస్తకాలుగా రచించారు. ఆ పుస్తకాల్లోని కొంత ఇంపార్టెంట్ సమాచారాన్ని సేకరించాడు డైరెక్టర్ నాగ్. అంతేకాక, ఆమె సహచరులు, సన్నిహితుల నుండి, ఎవ్వరికీ తెలియని కొన్ని నమ్మలేని నిజాలను కూడా సేకరించారు. ఆ నమ్మలేని నిజాల్ని తెరపై చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురి కాక తప్పదట. అంతేకాదు, ఈ సినిమాలో ఎందరో ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ఇంతమంది నటీనటులు నటించిన చిత్రం ఈ మధ్య కాలంలో రాలేదు.
ఓ యంగ్ డైరెక్టర్ ఇంత మంది స్టార్స్‌ని ఒకే స్క్రీన్‌పై మేనేజ్ చేయడమంటే చిన్న విషయం కాదు, ఓ యజ్ఞంలా చేశారీ సినిమా. అందుకే 'మహానటి' దిస్ ఈజ్ సమ్‌థింగ్ స్పెషల్. సావిత్రి మహానటి. అలాంటి మహానటి జీవితాన్ని ఇన్నేళ్లలో సినిమాగా తెరకెక్కించాలన్న ఆలోచన ఏ డైరెక్టర్‌కీ రాలేదింతవరకూ. ఓ కొత్త దర్శకుని మనసులో మెదిలిన అపురూపమైన ఆలోచన ఇది. ఇద్దరు అమ్మాయిలు ఈ చిత్రాన్ని నిర్మించారు. వారే ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కుమార్లైలు ప్రియాంకా దత్, స్వప్నాదత్. వీరే కాదు, ఈ చిత్రానికి ఎందరో ఆడపిల్లలు కలిసి పని చేశారు. ప్రతీ ఒక్కరూ చూడదగ్గ అతి ముఖ్యమైన సినిమా 'మహానటి'.
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో సమంత, విజయ్ దేవరకొండ కీలక పాత్రల్లో నటించారు. దుల్కర్ సల్మాన్, మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్, నాగచైతన్య తదితరులు ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.