దాదాపు 50 కోట్ల నష్టాన్ని 'ఎన్టీఆర్ కథానాయకుడు' మూట కట్టుకున్నాక 'మహానాయకుడు'పై అంచనాలకు ఆస్కారమెక్కడుంటుంది. ఇదే ప్రశ్న నందమూరి అభిమానుల్లోనూ వ్యక్తమవుతోంది. స్వర్గీయ ఎన్టీఆర్ అంటే తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అన్న అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోన్న ఈ పరిస్థితుల్లో ఆ మహనీయుడి బయోపిక్ దారుణ పరాజయాన్ని చవి చూడడం బాధాకరమే.
ఏమాత్రం అంచనాల్లేకుండా వచ్చిన 'యాత్ర' భళా అనిపించుకుంది. సంచలన విజయం అని గానీ, మంచి విజయం అని గానీ అనలేం. అయితే 'యాత్ర' సినిమా వైఎస్సార్ మీద గౌరవం పెంచేలా చేసింది. 'కథానాయకుడు' అలా చేయలేకపోయింది. ఇప్పుడు 'ఎన్టీఆర్ మహానాయకుడు' ఏం చేయబోతుందో. అసలు సినిమాలో ఏముంటుందో ఎవరికీ తెలియదు. రాజకీయాల్లో ఎన్టీఆర్ ఎంత ఎత్తుకు ఎదిగారో అంత ఎత్తు నుండి పాతాళానికి అలాగే పడిపోయారు.
నన్ను ఓడించారు మహాప్రభో..! అంటూ ఓ మహానాయకుడు కంటతడి పెట్టిన సందర్భం అందరికీ తెలుసు. మరి ఈ పరిస్థితిని బయోపిక్‌లో చూపిస్తారా.? చూపించరా.? చూపించకపోతే అసలు ఆ సినిమాకి అర్ధమే ఉండదు. ఇంతటి అగ్గిపరీక్ష నడుమ బాలయ్య 'మహానాయకుడు' సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మరోపక్క 'ఇదీ నిజం' అంటూ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'తో బాలయ్యనూ, 'మహానాయకుడు' సినిమాను టీజ్ చేయబోతున్నాడు.