ఎట్టకేలకు 'మహానాయకుడు' విడుదల తేదీ ఫిక్సయ్యింది. ఈనెల 22న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. నిజానికి ఈనెల 7నే ఈ సినిమా రావాల్సింది. తొలి భాగం 'కథానాయకుడు' డిజాస్టర్ అవ్వడంతో ఆ పరాజయ భారం నుంచి తేరుకోవడానికి చిత్రబృందానికి ఇంకాస్త సమయం కావాల్సివచ్చింది. పైగా 'ఎన్టీఆర్ మహానాయకుడు'లో మార్పులు చేర్పులూ చేయాల్సివచ్చింది. అందుకే 22 వరకూ ఆగారు.
అయితే ఇప్పుడు బాలయ్య తీసుకున్న సరికొత్త నిర్ణయం పంపిణీదారులలోనే కాదు, అభిమానుల్నీ, చిత్ర బృందాన్నీ తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తోంది. 'కథానాయకుడు' పబ్లిసిటీ కోసం భారీగా ఖర్చు పెట్టాడు బాలయ్య. కేవలం ప్రచారం కోసమే 4 కోట్ల వరకూ అయ్యాయి. అయితే.. ఈసారి మహానాయకుడికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదని డిసైడ్ అయ్యాడట. పేపర్లు, టీవీ ఛానల్స్‌లో యాడ్లు కూడా భారీగా తగ్గించాలని సూచించాడట.
తొలి భాగానికి ఆ స్థాయిలో ఖర్చు పెట్టినా.. సరైన ఓపెనింగ్స్ రాలేదు. అలాంటిది ఏం ఖర్చు పెట్టకపోతే జనం ఎలా థియేటర్లకు వస్తారు? అనేది అసలు ప్రశ్న. ఇది బాలయ్య సొంత సినిమా. సొంత సినిమా చేసినప్పుడు ప్రచారం మరింత ముమ్మరంగా చేయాలి. కానీ బాలయ్య మాత్రం మరీ పిసినారి అయిపోయాడు. ఈనెల 22న మహానాయకుడు విడుదల అవుతోంది. అంటే సరిగ్గా వారం రోజుల సమయం ఉంది. ఈలోగా వీలైనంత ప్రచారం చేసుకోవాలి. కానీ ఆ దాఖలాలు కనిపించడం లేదు.