బాహుబలితో తెలుగు సినిమా మార్కెట్ మరింత పెరిగింది. బాలీవుడ్‌లోనూ ద్వారాలు తెరచుకున్నాయి. మిగిలిన భాషల్లోనూ రెడ్ కార్పెట్ ఆహ్వానాలు అందాయి. దాంతో తెలుగు సినిమా కాస్త పాన్ ఇండియా ఇమేజ్ వైపు దృష్టి సారించింది. సాహో, సైరాలు పాన్ ఇండియా సినిమాలుగానే విడుదలయ్యాయి. సాహో.. మంచి వసూళ్లే దక్కించుకుంది గానీ, సైరాకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమా బాలీవుడ్ నాట భారీ నష్టాలు తెచ్చుకుంది. అయితే ఈ పరాజయం నుంచి తెలుగు సినిమా ఇంకా పాఠం నేర్చుకోలేదేమో..? పాన్ ఇండియా మంత్రం జపిస్తూనే ఉంది.
మహేష్ బాబు సైతం `పాన్ ఇండియా` స్టార్‌గా ఎదగాలని చూస్తున్నాడు. మహేష్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. దీన్ని అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయాలని మహేష్ భావిస్తున్నాడట. `సైరా` పరాజయం కంటే, ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన `కేజీఎఫ్` బాలీవుడ్‌లోనూ విజయ ఢంకా మోగించడం - మహేష్‌లో ధైర్యం నింపి ఉంటుంది. కేజీఎఫ్‌తో బాలీవుడ్‌నీ ఆకట్టుకున్నాడు ప్రశాంత్. ఆ విషయం తెలిసినదే. అందుకే.. ఈ సినిమాని బాలీవుడ్‌లోనూ విడుదల చేయాలని మహేష్ భావిస్తున్నాడు. సైరా విషయంలో చిరంజీవి పొరపాటు చేశారు. ఆ సినిమాని బాలీవుడ్‌లో రిలీజ్ చేయకుండా ఉండాల్సింది. మరి.. మహేష్ కూడా అదే పొరపాటు చేస్తున్నాడా, లేదంటే కథపై అంత నమ్మకం కుదిరిందా? అనేది తెలియాలంటే.. కొన్నాళ్లు ఆగాలి.