రంగస్థలంతో ఓ సూపర్ డూపర్ హిట్టు కొట్టేశాడు సుకుమార్. ఆ తరవాత మహేష్‌బాబుతో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో 'వన్ - నేనొక్కడినే' అనే సినిమా వచ్చింది. విమర్శకులు ఓకే అన్నా - మహేష్ అభిమానులకు మాత్రం అంతగారుచించలేదు. బాక్సాఫీసు వసూళ్లూ అంతంత మాత్రంగానే నిలిచాయి. అందుకే ఈసారి ఆ లోటు తీర్చే సినిమా అందించాలన్న తపనతో పనిచేస్తున్నాడు సుకుమార్.
ప్రస్తుతం ఈ స్క్రిప్టు విషయంలోనే తలమునకలై ఉన్నాడు. కథ ఇప్పటికే ఓకే అయిపోయింది. ఈ సినిమా కూడా 'రంగస్థలం' ఫార్మెట్ లోనే సాగుతుందని సమాచారం. అంటే.. పిరియడికల్ సినిమా అట. రంగస్థలం 1985 నేపథ్యంలో సాగింది. ఇప్పుడు ఇంకాస్త వెనక్కి వెళ్తున్నాడట. అయితే ఇది పల్లెటూరి నేపథ్యంలో సాగుతుందా, లేదా? అనేది తెలియాల్సివుంది.
''మరీ ప్రయోగాల జోలికి వెళ్లొద్దు.. కమర్షియల్ అంశాలు మిస్ అవ్వకూడదు'' అని మహేష్ సలహా ఇచ్చాడట. ఆ సూచనల్ని దృష్టిలో ఉంచుకునే సుకుమార్ స్క్రిప్టు రెడీ చేస్తున్నట్టు సమాచారం. అన్నట్టు ప్రభాస్ కొత్త సినిమా 'జాన్' (టైటిల్ ఇంకా ఖరారు కాలేదు) కూడా పిరియడిలక్ కథే. 'రంగస్థలం' ఎఫెక్టో ఏమో.. వరుసగా అగ్ర కథానాయకులంతా ఈ తరహ కథలనే ఎంచుకుంటున్నారు. ట్రెండ్ మరింది మరి.