విలక్షణ నటుడిగా సినిమాల్లో సత్తా చాటుతూనే వీలు చిక్కినప్పుడల్లా సామాజికి సేవలోనూ తనదైన ఉత్సాహం చూపిస్తుంటాడు మంచు వారబ్బాయ్ మంచు మనోజ్. తాజాగా మంచు మనోజ్ ఓ పాపను దత్తత తీసుకున్నాడు. తన తండ్రి మోహన్‌బాబు 69వ పుట్టినరోజు సందర్భంగా సిరిసిల్ల ప్రాంతానికి చెందిన అస్మితను మంచు మనోజ్ దత్తత తీసుకుంటున్నట్లుగా ప్రకటించాడు.
ఆ పాపకు మంచి చదువు చెప్పిస్తాననీ, పాపకి కావల్సిన ఖర్చు అంతా తాను భరిస్తాననీ, బాగా చూసుకుంటాననీ భరోసా ఇచ్చాడు. అస్మితను విద్యానికేతన్ పాఠశాలలో చేర్పించిన మంచు మనోజ్.. ఐఏఎస్ అధికారి కావాలన్న ఆ పాప కోరికను నెరవేర్చడంలో పూర్తి బాధ్యత తీసుకుంటానని మనోజ్ చెప్పారు. ఇదంతా బాగానే ఉంది. కానీ ఈ విషయమై సోషల్ మీడియాలో మంచు మనోజ్‌కి ఓ నెటిజన్ నుండి వింత అనుభవం ఎదురైంది.
'దత్తత తీసుకోవడం బాగానే ఉంది. కానీ ఐఏఎస్ అధికారి కావాలని ఆ అమ్మాయిని ఒత్తిడి చేయకండి.. వయసు పెరిగేకొలదీ, ఆశయాలు మారిపోతాయి.. అని ఆ నెటిజన్ మంచు మనోజ్‌కి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. 'ఐఏఎస్ అధికారి కావాలన్నది ఆమె ఆశయం. ఆ ఆశయం నెరవేర్చడంలో తన వంతు సాయం చేస్తాను. కానీ ఆమె ఏం కావాలనేది డిసైడ్ చేయడానికి నేనెవర్ని బ్రదర్..' అంటూ అంతే స్వీట్‌గా రిప్లై ఇచ్చాడు మంచు మనోజ్. ప్రస్తుతం మంచు మనోజ్ సినిమాల నుండి తాత్కాలికంగా గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే.