ఇటీవల జరిగిన 'మా' ఎలక్షన్స్‌లో అధ్యక్ష పదవి కోసం జరిగిన రచ్చ తెలిసిందే. ఈ ఎలక్షన్స్‌లో శివాజీరాజా ఓటమి పాలయ్యారు. ఆ ఓటమిని జీర్ణించుకోలేని శివాజీరాజా, నరేష్ ప్యానెల్‌కి మెగా బ్రదర్ నాగబాబు మద్దతివ్వడం కారణంగానే తన విజయావకాశంపై దెబ్బ పడిందని గుస్సా అవుతున్నారు. అంతేకాదు, ఈ విషయమై నాగబాబుకు తాను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నానని ఆయన అంటున్నారు.
అయితే పోటీలో గెలుపోటములు అనేవి సహజం. అయినా మా ఎలక్షన్స్‌ని ఎవ్వరూ అంత సీరియస్‌గా తీసుకోవడం లేదు. అలాంటిది శివాజీరాజా ఎందుకింత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారో ఎవ్వరికీ అర్ధం కావడం లేదు. నాగబాబుకు ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడమేంటీ.? రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి.. చంద్రబాబు, కేసీఆర్‌ల మధ్య రగడతో కేసీఆర్ నోటి నుండి వెలువడిన ఈ 'రిటర్న్ గిఫ్ట్' అనే మాటకు బాగా పాపులారిటీ వచ్చేసిందిప్పుడు.
అదే మాటను అసలు ప్రాధాన్యతే లేని మా అధ్యక్ష పదవి కోసం శివాజీరాజా వాడేయడం హాస్యాస్పదం అనిపిస్తోంది. అయినా మద్దతివ్వడం అనేది ఎవరికి వారికే వ్యక్తిగతం. వ్యక్తిగా తన మద్దతు నరేష్‌కిచ్చారు నాగబాబు. అయినా ఒక్కసారి మాత్రమే పోటీ చేసే హక్కున్న మా అధ్యక్ష పదవికి రెండోసారి పోటీకి దిగడం శివాజీరాజా చేసిన తప్పు. గతంలోనూ మా ఎలక్షన్స్ టైంలో రాద్ధాంతం జరిగింది. అయితే ఈ సారి ఎలక్షన్స్ కామ్‌గా జరిగినా, తర్వాతి గొడవలు మాత్రం ఎక్కువైపోయాయి. చూడాలి మరి ఈ రగడ ఇంకెంత దూరం వెళుతుందో.