ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేయబోతున్నారనే గాలి వార్త ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతోంది. గతంలో చిరంజీవితో సినిమా చేయాలని ఉందని శంకర్ గతంలోనే పలుమార్లు తెలిపిన సందర్భాలున్నాయి. అయితే ఎట్టకేలకు ఇప్పటికి ఈ కాంబినేషన్ సెట్టయినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయట.
ప్రస్తుతం శంకర్, విశ్వనటుడు కమల్‌హాసన్‌తో 'ఇండియన్ 2' పనుల్లో బిజీగా ఉన్నారు. ఒకవేళ ఈ సినిమా పూర్తి కాగానే చిరుతో సినిమాకి రంగం సిద్ధం చేస్తారేమో. అయితే చిరంజీవి డేట్స్ ఇప్పుడప్పుడే ఖాళీ లేవు. ప్రస్తుతం 'సైరా'తో బిజీగా ఉన్న చిరంజీవి, తదుపరి కొరటాల శివతో సినిమా చేయాల్సి ఉంది. 'సైరా'ని దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత కొరటాల శివతో సినిమా అంటే వచ్చే ఏడాది ప్రధమార్ధంలో విడుదల కావచ్చు.
అంటే శంకర్ - చిరంజీవి కాంబినేషన్‌లో మూవీపై వచ్చే ఏడాదికి కానీ క్లారిటీ రాదు. ఈ లోగా శంకర్, 'ఇండియన్ 2' కంప్లీట్ చేయాల్సి ఉంది. మామూలుగానే శంకర్ సినిమాలకు ఎక్కువ టైం తీసుకుంటాడు. కానీ 'ఇండియన్ 2'ని మాత్రం త్వరగా కంప్లీట్ చేయాలనుకున్నాడు. కానీ ఈ సినిమా విషయంలోనూ ఏవో అవాంతరాలు అడుగడుగునా అడ్డు పడుతూ చిత్రీకరణ ఆలస్యానికి కారణమవుతున్నాయి. ఈ అవాంతరాల్ని దాటి, శంకర్ ఎంత త్వరగా 'ఇండియన్ 2' కంప్లీట్ చేస్తాడో చూడాలి మరి.