మెగాస్టార్ చిరంజీవి స్టార్ హీరో అని మాత్రమే తెలుసు. అయితే, ఆయనలో ఓ మంచి డైరెక్టర్ కూడా ఉన్నారన్న విషయం అందరికీ తెలీదు. ఆయన నటించిన సూపర్ డూపర్ హిట్ మూవీ 'గ్యాంగ్‌లీడర్'కి విజయ బాపినీడు దర్శకుడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, ఆ సినిమాని 40 శాతం చిరంజీవి డైరెక్షన్ చేశారన్న సంగతి మాత్రం చాలా కొద్ది మందికే తెలుసు. అలా తెలిసిన నటుడు నారాయణరావు, తాజాగా ఈ విషయాన్ని అందరికీ తెలియపరిచారు.
'గ్యాంగ్‌లీడర్' సినిమాలో చిరంజీవి ఫ్రెండ్ గ్యాంగ్‌లో ఒకరు నారాయణరావు. తాజాగా ఓ కార్యక్రమంలో చిరంజీవితో ఆయనకున్న అనుబంధం గురించి మాట్లాడుతూ, పలు ఆసక్తికరమైన అంశాల్ని పంచుకున్నారు. అందులో భాగంగానే చిరంజీవి డైరెక్షన్ టాలెంట్ గురించి సవివరంగా వివరించారు. అంటే చాన్నాళ్ల క్రితమే చిరంజీవి డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌ని టచ్ చేశారన్న మాట. అయితే, నారాయణరావు చెప్పేంతవరకూ ఈ విషయం ఎవ్వరికీ తెలియలేదు. అంతేకాదు, 'ఠాగూర్' సినిమాకీ చిరంజీవి హస్తం ఉందట.
ఆ సినిమాలోని కొన్ని సీన్స్ చిరంజీవి డైరెక్షన్‌లోనే తెరకెక్కాయని అప్పట్లో డైరెక్టర్ వినాయక్ కూడా ఓ సందర్భంలో తెలిపారు. 'గ్యాంగ్‌లీడర్' టైంలోనే ఆయన్ని దర్శకుడిగా మారాలని చాలా మంది సూచించారట. అయితే, డైరెక్షన్ తనకు ఇంట్రెస్ట్ లేదని చెప్పారట చిరంజీవి. అంతెందుకు.? 150 వ సినిమా 'ఖైదీ' టైంలో కూడా ఈ ప్రస్థావన చిరంజీవి ముందుకొచ్చింది. అప్పుడు కూడా అంతే, 'ఇన్ని సినిమాల్లో నటించిన అనుభవంతో, డైరెక్షన్ చేయడం పెద్ద విషయం కాదు నాకు.. కానీ, అటు వైపు ఇంట్రెస్ట్ లేదని..' చిరంజీవి తేల్చేశారు. మొత్తానికి మెగాస్టార్ మెగాఫోన్ వెనక ఉన్న అసలు సిసలు కథ ఇది.