లాక్ డౌన్ వల్ల ఆగిపోయిన షూటింగులు ఎట్టకేలకు ప్రారంభం కానున్నాయి. సరికొత్త మార్గదర్శకాల మధ్య చిత్రసీమ క్లాప్ కొట్టుకోనుంది. ప్రభుత్వం ఇప్పటికే సినిమా షూటింగులకు సంబంధించిన కొన్ని సూచనలు చేసింది. చిత్రసీమ కూడా తమవైన కొన్ని విధీ విధానాలను రూపొందించుకుంది. ప్రభుత్వం కూడా ఓకే అంటే... షూటింగులు మొదలవుతాయి. అయితే సోషల్ డిస్టెన్సీని పాటిస్తూ నటించడం కుదురుతుందా, లేదా? అనేది పెద్ద ప్రశ్న. సినిమా అన్నది మాస్ మీడియా. థియేటర్లో, తెరపై జనం కనిపించాల్సిందే. హీరో హీరోయిన్లు అడుగుదూరంలో నిలబడి రొమాన్స్ చేసుకోవడం, చేయి చేయీ కలప కుండా డ్యూయెట్లు పాడడం కుదరని పని.
సీనియర్ నటుడు నరేష్ కూడా ఇదే అంటున్నారు. ''సోషల్ డిస్టెన్సీ పాటిస్తూ నటించడం కష్టం. హీరో, హీరోయిన్లు ముట్టుకోకుండా ఎలా? రొమాన్స్, ఫైట్స్.. ఇవన్నీ మాస్కులు పెట్టుకుని చేయలేం కదా. సో.. సోషల్ డిస్టెన్సీ పాటించడం కష్టం. కానీ సెట్లో మిగిలిన సభ్యులంతా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ల ఆరోగ్యాల్ని పణంగా పెట్టి షూటింగులు చేయం. సినిమా వాళ్లకు సైతం.. ఆరోగ్యాలే ముఖ్యం. వాటికి భంగం కలిగించకుండానే షూటింగులు పూర్తి చేసుకోవాలి'' అని వ్యాఖ్యానించారు.