నాగబాబు బాలయ్యని అంత తేలిగ్గా వదిలేలా కనిపించడం లేదు. బ్లడ్డూ, బ్రీడూ.. అంటూ ఎగతాళి చేయడం, స్థాయి తగ్గించి కించపరిచేలా మాట్లాడడం ఇవన్నీ బాలయ్య చేశాడు. వాటిపై నాగబాబు రివేంజ్ స్టార్ట్ చేశాడు. బాలయ్య మీద కొన్ని చాప్టర్స్ నడిపి సంచలనానికి కారణమైన నాగబాబు ఇప్పుడు కొత్త కుంపటి రాజేశాడు.
అప్పుడు ఆ చాప్టర్స్‌కి శుభం కార్డు వేసినా, అసలు కుంపటితో ఇప్పుడు ఇంకోసారి బాలయ్య మీద విరుచుకుపడబోతున్నాడు. ప్రస్తుతానికి 'మై ఛానెల్ నా ఇష్టం' అనే పేరుతో యూ ట్యూబ్ వార్‌కి తెర లేపాడు. అందులో భాగంగా ముందుగా బాలయ్య అల్లుడు, మంత్రి నారా లోకేష్‌ని టార్గెట్ చేశాడు. ఓ సందర్భంలో నారా లోకేష్ నోరు జారి తెలుగుదేశం పార్టీనే నానా తిట్లు తిట్టేసిన సంగతి గతంలో విదితమే.
దాన్ని ప్రస్థావిస్తూ, లోకేష్ చిన్నపిల్లాడు.. అన్నీ నిజాలే చెప్పాడు. అందుకే అంటారు పిల్లలూ, దేవుడూ చల్లని వారే. కల్ల కపటమెరుగని కరుణామయులే.. అని నారా లోకేష్‌ని ఉద్దేశించి మెగా బ్రదర్ నాగబాబు సెలవిచ్చాడు. నిజాలు మాట్లాడడానికి ధైర్యం ఉండాలి. నిజాలు మాత్రమే మాట్లాడే రాజకీయ నాయకులు ఎవరుంటారు చెప్పండి అన్నట్లుగా మెగాబ్రదర్ సెటైర్స్ వేశారు. అంటే నాగబాబు 'మై ఛానెల్ నా ఇష్టం'లో నెక్ట్స్ బాలయ్యకు మళ్లీ పంచ్ పడనుందనే అనుకోవాలేమో.