సెలబ్రెటీలు రెండు రకాలు. ప్రతీ రోజూ ఏదోలా న్యూస్‌లో కనిపించేవాళ్లు ఓరకం అయితే... న్యూస్ నే సృష్టించే న్యూస్ మేకర్స్ రెండోరకం. వాళ్ల చుట్టూ వార్తలు నడుస్తుంటాయి, గాసిప్పులు పుడుతుంటాయి, ఎప్పుడు ఏం మాట్లాడతారా అని కెమెరా కళ్లు ఎదురుచూస్తుంటాయి. టాలీవుడ్‌లో న్యూస్ మేకర్స్‌కి కొదవలేదు. అప్పుడప్పుడూ ఓ సంచలన కామెంట్ వినిపించడానికీ, టీవీలో స్పెషల్ ప్యాకేజీ న్యూస్‌లు మారడానికీ, ఫేస్ బుక్‌లలో జనం మాట్లాడుకోవడానికి వాళ్లు హాట్ టాపిక్‌గా కనిపిస్తుంటారు. 2018లో అలాంటివాళ్లెవరో ఆరా తీస్తే.. రాంగోపాల్ వర్మ, నందమూరి బాలకృష్ణ, నాగబాబు, శ్రీరెడ్డి ప్రముఖంగా కనిపిస్తారు.
తన రాతలతో, మాటలో, సినిమాలతో మీడియాకెప్పుడూ కావల్సినంత స్టఫ్ ఇస్తుంటాడు రాంగోపాల్ వర్మ. 2018లోనూ తానే టాక్ ఆఫ్ ది ఇండ్రస్ట్రీ అయ్యాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్‌తో వర్మ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఈసినిమాతో వర్మ ఏం చెప్పబోతున్నాడా అంటూ నందమూరి అభిమానులు, సగటు సినీ ప్రేక్షకులు, వర్మ భక్తులూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రకటన వచ్చినప్పటి నుంచీ... ఈ సినిమాపై, వర్మపై ఫోకస్ పెరిగింది. పాటలతో ఇప్పటికే.. ఈ సినిమా పేరు మార్మోగిపోయేలా చేస్తున్నాడు వర్మ. విడుదల లోపు ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.
బాలయ్య ఏం మాట్లాడినా కిక్ వస్తుంది. నోరు జారినా, చేయి జారినా అది వార్తయిపోతుంది. 2018లోనూ బాలయ్య అలాంటి వినోదం పంచిపెట్టాడు. ఎన్నికల సమయంలో నందమూరి బాలకృష్ణ ప్రసంగాలు కావల్సినంత కామెడీ తెచ్చి పెట్టాయి. మరీ ముఖ్యంగా `బుల్ బుల్` మరీ ట్రెండింగ్ అయ్యింది. `బాలకృష్ణ ఎవరు?` అని అడిగి.. నాగబాబు మరో సంచలనానికి తెరతీశాడు. ఇది వరకు `పవన్ కల్యాణ్ ఎవరో నాకు తెలీదు` అని బాలయ్య నోరు జారిన పాపానికి నాగబాబు ఇలా కౌంటర్లు ఇస్తూ ప్రతీకారం తీర్చుకోవడం.. నందమూరి - మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్‌కి మధ్య చిచ్చు రాజేసింది.
ఇక శ్రీరెడ్డి గురించి చెప్పాల్సిన పనిలేదు. పవన్ కల్యాణ్ ని తిట్టి కొంత, ఫిల్మ్ ఛాంబర్ ముందు అర్థనగ్న ప్రదర్శన చేసి కొంత పాపులారిటీ సంపాదించేసింది. తన ట్వీట్లలో వెటకారాలు, కాస్టింగ్ కౌచ్‌పై చేసిన ఉద్యమం టాలీవుడ్‌ని షేక్ చేసేశాయి. మొత్తానికి ఈ నలుగురి వల్ల.. టాలీవుడ్ 2018లో గరమ్ గరమ్‌గా సాగింది. మరి ఈ యేడాది వీళ్ల వ్యూహాల ఎలా ఉంటాయో చూడాలి.