ప్రేమించి, పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్న జంట నాగచైతన్య, సమంత. వీరిద్దరూ పెళ్లికి ముందే మూడు చిత్రాల్లో కలిసి నటించారు. అయితే పెళ్లి తర్వాత ఇంకా స్క్రీన్ షేర్ చేసుకోలేదు. ఆ అరుదైన అవకాశం తొందర్లోనే రాబోతోందన్న సంగతి తెలిసిందే. 'నిన్నుకోరి' ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ రియల్ లైఫ్ జంట రీల్ లైఫ్ జంట కానుంది.
ఈ సినిమాని ఈ నెల 23 న లాంఛనంగా ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్‌కి ప్లాన్ చేస్తున్నారు. కాగా ఇదో రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అని తెలుస్తోంది. ఈ సినిమాలో చై, శామ్ పెళ్లయిన దంపతుల్లాగే నటించనున్నారని తెలుస్తోంది. ఆల్రెడీ దంపతుల్లా వీరిద్దరూ ఓ వాణిజ్య ప్రకటనలో నటించారు. అయితే బిగ్ స్క్రీన్ షేర్ చేసుకోవడం పెళ్లి తర్వాత ఇదే తొలిసారి కానుంది.
ఈ అవకాశం కోసం చై, శామ్‌తో పాటు అభిమానులు కూడా ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్య చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చైతూ నటిస్తున్న 'సవ్యసాచి' త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే, రీసెంట్‌గా మేనమామ వెంకటేష్‌తో ఓ మల్టీస్టారర్ స్టార్ట్ అయ్యింది.
ఇక సమంత సంగతి చెప్పనే అక్కర్లేదు. పెళ్లి తర్వాత వరుసగా 'రంగస్థలం', 'మహానటి', అభిమన్యుడు' సినిమాలతో హ్యాట్రిక్ కొట్టేసింది. ఇప్పుడు 'యూ టర్న్' సినిమాలో నటిస్తోంది. ఇదీ సస్పెన్స్ ధ్రిల్లర్ మూవీనే కావడం విశేషం.