ముందు నుంచీ... నాగచైతన్యకు పేరు తీసుకొచ్చిన కథలన్నీ ప్రేమకథలే. `ఏం మాయ చేశావే`, `100 % లవ్`... ఇలాంటి సినిమాలే చైతూకి పేరు తీసుకొచ్చాయి. యాక్షన్ హీరోగా ట్రై చేద్దామని ఎంత ప్రయత్నించినా - పెద్దగా ఫలితం రాలేదు. ఇప్పుడు మళ్లీ చైతూ ప్రేమకథల బాట పట్టాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేస్తున్న `లవ్ స్టోరీ` పక్కా ప్రేమ కథ. అయితే.. ఇప్పుడు మాస్ కథలపై మళ్లీ దృష్టి పెట్టబోతున్నాడట చైతూ.
యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ చెప్పిన కథకు.. చైతూ ఓకే చెప్పాడని ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇందులో చైతూ ఓ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడట. ఈ పాత్ర చాలా మాసీగా ఉంటుందని సమాచారం అందుతోంది. ఈ తరహా పాత్ర చైతూ ఇప్పటి వరకూ చేయలేదని, తనకు ఈ సినిమాతో మాస్ లో ఫాలోయింగ్ పెరగడం ఖాయమని అంటున్నారు.
ప్రస్తుతం `థ్యాంక్యూ`లో నటిస్తున్నాడు చైతూ. ఆ తరవాతే.. తరుణ్ భాస్కర్ సినిమా పట్టాలెక్కే ఛాన్సుంది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించబోతోందని టాక్.