మే 9న 'మహర్షి' విడుదల కానుంది. భారీ అంచనాల నడుమ విడుదలవుతోన్న 'మహర్షి' రిజల్ట్ ఏమాత్రం కాస్త అటూ ఇటూ అయినా తర్వాతి రోజు వచ్చే 'నాగకన్య'కు అది కలిసొస్తుందేమో. ఎందుకంటే ఈ మధ్య నాగిని తరహాలో సినిమాలు పెద్దగా రావడం లేదు. గతంలో ఈ జోనర్‌లో చాలా సినిమాలొచ్చాయి. వాటిలో 'దేవి' తదితర సినిమాలు మంచి విజయాలందుకున్నాయి. అంతకు ముందే 'నాగిని' సినిమా అంటే అతిలోక సుందరి శ్రీదేవి సినిమా గుర్తొస్తుంది. ఆ తర్వాత మల్లికా షెరావత్ నటించిన 'హిస్' సినిమాకి విడుదలకు ముందు భారీ స్థాయిలో బజ్ క్రియేట్ అయ్యింది.
అయితే సినిమా విడుదలయ్యాక డిజాస్టర్‌గా నిలిచింది. ఏకంగా హాలీవుడ్ స్థాయి మేకింగ్ అంటూ ఈ సినిమా విషయంలో చాలా బిల్డప్ ఇచ్చారు. కానీ విడుదలయ్యాక తుస్సుమనిపించారు. అయితే రీసెంట్ మూవీ 'నాగకన్య' విషయానికి వస్తే, గతంలో వచ్చిన 'నియా' సినిమాకి ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది. కానీ, కథ విషయంలో అప్పటి నియాకీ, ఈ 'నియా 2'కీ అస్సలు పోలికే ఉండదట. తెలుగులో ఈ సినిమాని 'నాగకన్య' పేరుతో విడుదల చేస్తున్నారు.
అన్నింటికీ మించి, ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, ఈ సినిమాలో ఒక్క నాగిని కాదు, ముగ్గురు నాగినులు నటిస్తున్నారు. రాయ్ లక్ష్మీ, కేథరిన్, వరలక్ష్మీ శరత్‌కుమార్. ఈ ముగ్గురూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. జై హీరోగా నటిస్తున్నాడు. టీజర్, ట్రైలర్‌లు ప్రేక్షకుల్లో ఆశక్తిని కలిగిస్తున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. అసలే వేసవి సెలవులు కావడంతో ఈ జోనర్ మూవీస్‌కి ఎక్కువగానే ఆదరణ దక్కే అవకాశాలున్నాయి. మరి ప్రతిష్ఠాత్మక చిత్రం 'మహర్షి'తో పోటీపడుతూ వస్తోన్న 'నాగకన్య' నిలబడుతుందో లేదో చూడాలంటే జస్ట్ వెయిట్ ఫర్ త్రీ డేస్ అంతే.