జగన్ మోహన్ రెడ్డి తో నాగార్జున భేటీ పరిశ్రమ వర్గాలలో సంచలనం కలిగించింది. నాగార్జున వైకాపాలో చేరడం ఖాయమని, ఆయన గుంటూరు నుంచి పోటీ చేయబోతున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి. వీటిపై నాగార్జున తొలిసారి నోరు విప్పారు. జగన్‌ని కేవలం గౌరవ సూచకంగానే కలుసుకున్నానని, రాజకీయాల్లో చేరే ఉద్దేశ్యం ఏమాత్రం లేదని స్పష్టం చేశారు నాగ్.
ఇటీవల జగన్ పాద యాత్ర పూర్తి చేశారు. ఈ సందర్భంగా జగన్‌ని అభినందించడానికి వెళ్లానని నాగ్ చెప్పుకొచ్చారు. గుంటూరు లోక్ సభ టికెట్టుని తన స్నేహితుడికి ఇప్పించలవలసిందిగా నాగ్ కోరడానికే, జగన్‌ని కలిశారని కూడా వార్తలొచ్చాయి. వీటినీ త్రోసి పుచ్చాడు నాగ్. తన స్నేహితుడి కోసం జగన్‌ని కలిసే అవసరం తనకు లేదని చెప్పారు.
జగన్‌ని కేవలం అభినందించడానికే అయితే... ఒక్క ఫోన్ కాల్ చాలు. కానీ... ఎప్పుడూ లేనిది లోటస్ ఫాండ్‌లో నాగ్ ప్రత్యక్షం అవ్వడంతో... ఈ ఊహాగానాలు వ్యాప్తి చెందాయి. నాగ్ వైకాపాలో చేరబోతున్నారన్న వార్త ఇప్పటిది కాదు. అయితే ఎప్పటికప్పుడు నాగ్ ఖండిస్తూనే వచ్చాడు. అయినా సరే, పుకార్లు ఆగలేదు. నాగ్ తాజా కామెంట్‌తో ఈ వార్తలకు ఇక పుల్ స్టాప్ పడినట్టే అనుకోవాలి.