కమర్షియల్ చిత్రాలను తెరకెక్కించడంలో అభిరుచి గల దర్శకుడిగా రాఘవేంద్రరావు పేరు ముందు వరుసలో ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక చిత్రాలను తెరకెక్కించడంలోనూ ఆయనది అందె వేసిన చేయి. నాగార్జున - రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో తెరకెక్కిన ఆధ్మాత్మిక చిత్రం 'అన్నమయ్య' అప్పట్లో రికార్డులు కొల్లగొట్టింది. నాగార్జున కెరీర్‌లోనే బెస్ట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిందీ సినిమా.
'అన్నమయ్య'తో ప్రారంభమైన వీరి ఆధ్యాత్మిక ప్రయాణం ఆ తర్వాత 'శ్రీరామదాసు', 'షిరిడీసాయి', 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం వరకూ కొనసాగింది. వీటిలో 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం కాస్త నిరాశపరిచింది. కానీ ఆధ్యాత్మిక చిత్రాల్లో ప్రత్యేకమైనదిగానే నిలిచింది. ఇదిలా ఉండగా, ఈ కాంబినేషన్‌లో మరో ఆధ్యాత్మిక చిత్రం రాబోతోందంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఆ సినిమా 'అన్నమయ్య' స్థాయిలో ఉండనుందని విశ్వసనీయ వర్గాల సమాచారమ్. అయితే గత రెండేళ్లుగా రాఘవేంద్రరావు సినిమాలకు దూరంగా ఉన్నారు.
'ఓం నమోవేంకటేశాయ' చిత్రం తర్వాత రాఘవేంద్రుడు 'స్టార్ట్, కెమెరా, యాక్షన్' అనింది లేదు. అయితే ఆయన ఎక్కడ ఆపారో అక్కడి నుండే మళ్లీ మొదలుపెట్టాలని అనుకుంటున్నారట. అందుకోసం ఓ బ్రహ్మాండమైన భక్తి కాన్సెప్ట్‌ని ప్రిపేర్ చేశారట. ఈ సినిమాని నాగార్జునతోనే తెరకెక్కించాలని ఆయన అనుకుంటున్నారట. త్వరలోనే ఈ సినిమాపై పూర్తి వివరాలు తెలియనున్నాయి. మరోపక్క నాగార్జున, రామ్‌గోపాల్‌వర్మ సినిమాతో బిజీగా ఉన్నారు. శరవేగంగా ఈ సినిమా ముంబయ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా పూర్తి కాగానే రాఘవేంద్రరావు సబ్జెక్ట్‌పై క్లారిటీ ఇవ్వనున్నారనీ తెలుస్తోంది.