నాగార్జున వందో సినిమాకి చేరుకోబోతున్నారు. ఆయన చేస్తున్న `ఘోస్ట్` నాగ్ కెరీర్‌లో 99వ సినిమా. అంటే తదుపరి సినిమాతో సెంచరీ కొట్టేస్తారన్నమాట. వందో సినిమా అంటే మాటలా? చాలా స్పెషల్ కథ కావాలి. అందుకే తమిళ దర్శకుడు మోహన్ రాజాకు అవకాశం ఇచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవితో `గాడ్ ఫాదర్` రూపొందిస్తున్నారు మోహన్ రాజా.
ఇప్పుడు నాగ్ వందో సినిమా కోసం ఓ కథ సిద్ధం చేశారని తెలుస్తోంది. ఇందులో అఖిల్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడని సమాచారం. మొత్తానికి ఇది అక్కినేని మల్టీస్టారర్ అన్నమాట. బంగార్రాజులో నాగచైతన్యతో నటించాడు నాగ్. ఇప్పుడు అఖిల్ తో చేసేస్తున్నాడు. అలా ఇద్దరినీ కవర్ చేసేశాడు.
ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయించబోతున్నారని తెలుస్తోంది. వందో సినిమా కాబట్టి.. రూ.100 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. నాగ్ కి అంత మార్కెట్ లేదు. అఖిల్ కలిసొచ్చినా ఇది పెద్ద మొత్తమే. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థనే ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మరి.. వంద కోట్ల మేటర్ నిజమా, కాదా తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.