అక్కినేని హీరోలు నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ హీరోలుగా నిలదొక్కుకునేందుకు తమ వంతు ప్రయత్నం తాము చేస్తూనే ఉన్నారు. చైతూ ఎలాగోలా బండి నడిపిస్తున్నాడు. కానీ సరైన హిట్టే దొరకడం లేదు. ఇటీవల 'సవ్యసాచి'తో వచ్చి ఓకే అనిపించుకున్నాడు. కానీ అఖిల్ పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగానే ఉంది. ఇకపోతే అఖిల్ సంగతి సరే సరి.. చైతూకి హిట్ ఇచ్చేందుకు స్వయానా నాగార్జునే రంగంలోకి దిగాడట.
నాగార్జున హీరోగా వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమా నాగార్జునకు కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చింది. ఆ టైంలోనే ఈ సినిమాకి సీక్వెల్ రూపొందించాలనుకున్నారు. కానీ కుదరలేదు. ఇక త్వరలో ఈ సీక్వెల్‌ని పట్టాలెక్కించేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారనీ తెలుస్తోంది. మొదటి పార్ట్‌లో నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. ఈ పార్ట్‌కొచ్చేసరికి త్రిపాత్రాభినయం అని తెలుస్తోంది. అయితే మూడో పాత్ర కోసం చైతూని తీసుకునే యోచనలో నాగార్జున ఉన్నట్లు తెలుస్తోంది.
తాత, తండ్రి పాత్రలను నాగార్జున పోషించగా మనవడి పాత్రలో చైతూ కనిపించనున్నాడనీ ప్రచారం జరుగుతోంది. అంటే కొడుక్కి హిట్ ఇచ్చేందుకు నాగార్జున ఎంత తాపత్రయపడుతున్నాడో అర్ధం చేసుకోవాలి. మరోవైపు చైతూకి మేనమామ అయిన వెంకీ కూడా అదో దారిలో ఉన్నాడు. వెంకీ, చైతూ కాంబోలో రూపొందుతోన్న 'వెంకీ మామ'పైనా అంచనాలు బాగానే ఉన్నాయి. చూడాలి మరి ఇటు తండ్రి, అటు మేనమామ.. చైతూకి విజయం ఎవరి రూపంలో వరించనుందో.!