కథానాయకుడు, మహానాయకుడు సినిమా ఫలితాల్ని పూర్తిగా పక్కన పెట్టిన నందమూరి బాలకృష్ణ... ప్రస్తుతం ఏపీ ఎన్నికల వైపు దృష్టి పెట్టారు. ఈసారి కూడా ఆయన హిందూపూర్ నియోజక వర్గం నుంచి ఎం.ఎల్.ఏగా పోటీ చేయబోతున్నారు. హిందూపూర్ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్టీఆర్ సొంత నియోజక వర్గం అనే సెంటిమెంట్ తనకు విజయాన్ని చేకూర్చి పెడతాయన్నది బాలయ్య నమ్మకం.
అంతేకాదు... ఈసారి గెలిస్తే.. మంత్రి పదవి దక్కడం కూడా ఖాయంగా కనిపిస్తోంది. నిజానికి 2014లోనే బాలయ్య మంత్రి అవుతారని ప్రచారం జరిగింది. అయితే బాలకృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగడం అదే తొలిసారి కావడంతో.. మంత్రి పదవి ఆలోచన పక్కన పెట్టారు చంద్రబాబు. తొలిసారే ఎమ్మెల్యేకి అవకాశం ఇస్తే, 'కుటుంబ పాలన' అనే ముద్ర పడుతుందని బాబు భయపడ్డారని టాక్.
ఈసారి మాత్రం బాలయ్యకు మంత్రి పదవి దక్కడం ఖాయమని ఆయన అభిమానులు కూడా నమ్ముతున్నారు. ఎలాగూ.. సినీ రంగంలో అపారమైన అనుభవం ఉంది కాబట్టి సినిమాటోగ్రఫీ మంత్రిగా బాలయ్యని చూడొచ్చని తెలుస్తోంది. అయితే అంతకంటే ముందు హిందూపూర్ నుంచి బాలయ్య గెలవాలి.. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావాలి. ఇవి రెండూ జరిగితేనే మంత్రి పదవి.