'బెజవాడ రౌడీలు' అనే టైటిల్ అనౌన్స్ చేసి నాటి బెజవాడ రాజకీయ పరిస్థితుల్ని తన సినిమాలో చూపించాలనుకున్నారు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. అయితే టైటిల్ పట్ల అభ్యంతరాలు వ్యక్తం కావడంతో టైటిల్‌లోని 'రౌడీలు' తొలగించి, 'బెజవాడ' పేరుతో సినిమాని తెరకెక్కించి రిలీజ్ చేసేశారు. నాగచైతన్య ఆ సినిమాలో హీరోగా నటించాడు. అప్పట్లో అదో సెన్సేషనల్ అయ్యింది. ఆ తర్వాత 'వంగవీటి' పేరుతో మరో సినిమానీ తెరకెక్కించారు వర్మ.
అయితే వంగవీటితో పాటు, అప్పటి రాజకీయాల్లో పోటీగా ఉన్న మరో వ్యక్తి దేవినేని నెహ్రూ. ఇప్పుడు ఆయన జీవిత గాధ ఆధారంగానే సినిమా రాబోతోంది. దేవినేని పాత్రలో నందమూరి హీరో తారకరత్న నటిస్తున్నాడు. నర్రా శివ నాగేశ్వరరావు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, వర్మ సినిమాల మాదిరి ఈ సినిమాలో కాంట్రవర్సీకి చోటుండదంటున్నారు. దేవినేని చేసిన మంచి పనులనే సినిమాలో చూపిస్తామని దర్శకుడు చెబుతున్నారు.
ఇకపోతే తారకరత్న విషయానికి వస్తే, హీరోగా 'ఒకటో నెంబర్ కుర్రాడు' సినిమాతో తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించాడు కానీ, స్టార్‌డమ్ దక్కించుకోలేకపోయాడు. కెరీర్ బెస్ట్ మూవీ అంటే తారకరత్నకు 'అమరావతి' అనే చెప్పాలి. ఆ సినిమాలో హీరో అని చెప్పలేం కానీ, విభిన్నమైన పాత్రలో కనిపించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు తారకరత్న. ఈ మధ్య విలన్‌గానూ తన సత్తా చాటాడు. హీరోగా మళ్లీ చాన్నాళ్ల తర్వాత 'దేవినేని' సినిమాతో రాబోతున్నాడు. ఇదేమీ కమర్షియల్ మూవీ కాదు. మరి తారకరత్న కెరీర్‌కి 'దేవినేని' ఎంతగా ఉపయోగపడుతుందో చూడాలిక.