ఈ రోజు 'అ' సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. అయితే కొంతమంది ఈ సినిమాని ఆల్రెడీ వీక్షించారు. చూసిన వాళ్లలో సినీ ప్రియులు కొంతమంది చిన్న చిన్న వీడియోలు కట్ చేసి నెట్‌లో పెట్టేస్తున్నారు. సినిమాపై ఉన్న ఆశక్తి, ఉత్కంఠే ఇందుకు ఓ కారణం అని చెప్పొచ్చు. ఆ వీడియోలు ఇప్పుడు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ విషయంలో చిత్ర యూనిట్ కొంత ఆందోళన చెందుతుంది. నిన్ని మోహన్‌బాబు ఈ లీకుల విషయమై చాలా బాధపడ్డారు. ఎంతో కష్టపడి దర్శక, నిర్మాతలు సినిమాని తెరకెక్కిస్తారు.
ఆ సినిమా విడుదలవుతోందంటే వారికి ఉండే టెన్షన్ సాటి నిర్మాతకే తెలుస్తుంది కానీ, ఈ లీకులు చేసేవారికి తెలీదు అని చాలా బాధపడ్డారు. ఎంత మొత్తుకున్నా, కొత్త సినిమా విడుదలవుతోందంటే ఈ లీకుల బెడద మాత్రం ఆగట్లేదు. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత పూర్తిగా చిత్రసీమపైనే ఉన్నప్పటికీ, సామాన్య జనం, అభిమానులు కూడా కొంత నైతిక బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇకపోతే 'అ' విషయానికి వస్తే, సినిమాకి రిపోర్టులు చాలా పోజిటివ్‌గా వస్తున్నాయి. చెప్పినట్లే కాన్సెప్ట్ చాలా బాగుందంటున్నారు.
నాని రిస్క్ ఫలించినట్లే అనిపిస్తుంది ఈ రిపోర్ట్స్ వింటుంటే, కానీ సినిమా లీకులే కొంత బాధిస్తున్నాయి. ముఖ్యంగా కాజల్ సీన్స్ ఎక్కువగా లీకైనట్లు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'అ' చిత్రాన్ని నేచురల్ స్టార్ నాని నిర్మించారు. నాని సమర్పణలోనే వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌లో రూపొందింది. కాజల్ అగర్వాల్, రెజీనా, నిత్యామీనన్, అవసరాల శ్రీనివాస్, ఈషా రెబ్బ, మురళీ శర్మ, ప్రియదర్శన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇంకేముంది 'అ'ని ధియేటర్లో చూసి 'ఆహా!' అనేయడమే మిగిలుంది.