క్రికెట్‌లో 30 ఏళ్లు దాటితే రిటైర్మెంట్ ఎప్పుడు అనే చర్చ జరుగుతుంటుంది. ఆటగాడు ఎంత ఫామ్‌లో ఉన్నా, అవకాశాలు దక్కని పరిస్థితి. ఆ వయసు అలాంటిది. కానీ మన హీరో 36 ఏళ్ల వయసులో క్రికెటర్‌గా తానేంటో నిరూపించుకోవడానికి తహతహలాడుతుంటాడు. ఆ 36 ఏళ్ల క్రికెటర్ ఇంకెవరో కాదు, నేచురల్ స్టార్ నాని. 'జెర్సీ' సినిమా కథ ఇది.
'పిల్లల్ని ఆడించుకోవాల్సిన వయసులో పిల్లలతో కలిసి క్రికెట్ ఏంట్రా..' అని స్నేహితుడు కూడా వెటకారం చేస్తాడు. కానీ తన ఆలోచనల నుండి పక్కకి మళ్లడు అర్జున్. అర్జున్ పాత్రలో నాని తనదైన స్టైల్‌లో ఎమోషన్ పండించినట్లే కనిపిస్తోంది. ఇలాంటి ఎమోషన్స్ నానికి కొట్టిన పిండి. త్వరలో 'జెర్సీ' ప్రేక్షకుల ముందుకు రానుంది. 'ఆపేసి ఓడిపోయినవాడు ఉంటాడేమో కానీ, ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడుండడు..' అని టీజర్‌ని ముగించిన వైనం ఆకట్టుకుంటోంది.
శ్రద్ధా శ్రీనాధ్ ఈ సినిమాలో నానికి జోడీగా నటిస్తోంది. 'మళ్లీ రావా'తో డైరెక్టర్‌గా సత్తా చాటిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'జెర్సీ' తెరకెక్కుతోంది. 36 ఏళ్ల వయసులో అర్జున్ తాను అనుకున్నది సాధించాడా.? లేదా.? అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. మూస కథలతో బోర్ కొట్టించిన నాని 'జెర్సీ'తో ఏదో కొత్త ప్రయోగం చేసినట్లే ఉన్నాడు. చూడాలి మరి ఈ ప్రయోగం ఎంత మేర ఫలించేనో.!