ఓ సినిమా సంచలన విజయం సాధిస్తే, అది ఆ సినిమా నిర్మాతకు డబ్బులు తెచ్చిపెడుతుంది. టీమ్ మొత్తానికి కొత్త ఉత్సాహాన్నిస్తుంది. సినీ పరిశ్రమలో జోష్ పెంచుతుంది. అంతేతప్ప ఓ వ్యక్తికి పరిమితమైన విషయం కాదిది. దురదృష్టవశాత్తూ అభిమానుల తీరు సినిమాల జయాపజయాలపై చాలా తీవ్ర ప్రభావం చూపుతోంది. సినిమా రిలీజ్‌కి ముందు దుష్ప్రచారం ఓ ఎత్తు, రిలీజయ్యాక దుష్ప్రచారం ఇంకో ఎత్తు.
ఇటీవల కాలంలో చూసుకుంటే, 'వినయ విధేయ రామ' ఎదుర్కొన్నంత హేట్ ఇంకే సినిమా ఎదుర్కోలేదని చెప్పొచ్చు. తొలిరోజే సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది. అయితే సాయంత్రానికి వసూళ్ల వివరాలపై దాదాపు స్పష్టత వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 30 కోట్ల షేర్, 45 కోట్ల గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో ఇంకో వాదన వినిపిస్తోంది. 16 నుండి, 18 కోట్లలోపే షేర్ వచ్చిందనీ మిగతాదంతా ఫేక్ వ్యవహారమనీ హేటర్స్ ప్రచారానికి తెర లేపారు.
వాస్తవానికి సంచలన విజయం సాధించిన సినిమా అయినా, ఆ సినిమా వసూళ్లపై అనుమానాలు వ్యక్తమవుతుంటాయి. కొంచెం ఎక్కువ చేసి చూపించడం అనేది సినిమా ప్రమోషన్ స్ట్రేటజీ. సినిమా బాగోలేకపోతే ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఉపయోగం లేదు. కానీ డిజాస్టర్ టాక్‌తో 'వినయ విధేయ రామ' ఫస్ట్ డే షేర్ ఆశ్చర్యపరుస్తోంది. 'సరైనోడు' సినిమా టైంలో ఇలాంటి వాతావరణం చూశాం కానీ, 'వినయ విధేయ రామ' ఎదుర్కొన్నంత డిజాస్టర్ టాక్ 'అజ్ఞాతవాసి'కి తప్ప ఈ మధ్యకాలంలో ఏ సినిమాకీ రాలేదు.