సౌత్ క్వీన్‌గా అభివర్ణించబడుతోన్న ముద్దుగుమ్మ నయనతార లీడ్ రోల్‌లో నటించిన 'కొలైయుదిర్ కాలం' అనే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రెండ్రోజుల క్రితం చెన్నైలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో సీనియర్ నటుడు రాధా రవి నయనతారనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపాయి. సినిమా ప్రమోషన్స్‌కి నయనతార హాజరు కాదన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమా ప్రమోసన్స్‌లోనూ ఆమె పాల్గొనలేదు. అయితే సీనియర్ నటుడు కదా.. ఎందుకో ఆయనకు మనసు బాగా బాధించినట్లుంది. ఉండబట్టలేక బయటపడిపోయారు.
గతంలో ఓ సారి తెలుగులో కూడా దర్శకరత్న దాసరి కూడా ఇలాగే బయటపడిన సంగతి తెలిసిందే. హీరోయిన్లు కూడా సినిమాలో భాగమే. అలాంటప్పుడు ప్రమోషన్స్‌లో పాల్గొనడం తప్పనిసరి. సినిమా ఒప్పుకునే ముందే ఇదే విషయమై హీరోయిన్స్‌తో డీల్ సెట్ చేసుకోవాలి.. అని ఆయన మాట్లాడినట్లే ఇప్పుడు రాధారవి కూడా మాట్లాడారు. గతంలో కె.ఆర్.విజయ తదితర నటీమణులు దేవుడు, దెయ్యాల సినిమాల్లో నటించారు. ఆన్ స్క్రీనే కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా వారిని చూస్తే ఆ పాత్రల తాలూకు గౌరవం కలిగేది.
కానీ ఇప్పుడు హీరోయిన్లు అలా కాదు. దేవుడు, దెయ్యాల సినిమాల్లో నటిస్తున్నారు. కానీ వ్యక్తిగత జీవితాలు మాత్రం బాగుండడం లేదు.. అని చేసిన వ్యాఖ్యల పట్ల మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇప్పటికే ఆయనపై తాత్కాలిక సస్పెన్షన్ వేటు పడింది. తనపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, సీరియస్‌గా ఓ ప్రకటన విడుదల చేసింది నయనతార. మొత్తానికి, జరుగుతున్న రచ్చతో రాధారవి తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారనీ, ఎవరినీ కించపరచడం తన ఉద్దేశ్యం కాదనీ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేయాల్సి వచ్చింది చివరికి.