నయనతారలాంటి వాళ్లు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుని కనీసం ప్రెస్ మీట్స్‌కి కూడా రారు. అసలు సినిమాల్లో హీరోయిన్ ఎందుకు.? అనే ప్రశ్న ఉత్పన్నమవుతూ ఉంటుంది ఒక్కోసారి. సినిమాని ప్రమోట్ చేసుకునే అంత తీరిక లేనప్పుడు వారికి అవకాశాలు ఇవ్వడం కూడా దండగే అంటారు కొంతమంది. నిధి అగర్వాల్ అలా కాదు.. తన తొలి తెలుగు సినిమా 'సవ్యసాచి' విషయంలోనైనా, రెండో సినిమా 'మిస్టర్ మజ్ను' విషయంలోనైనా నిధి కమిట్‌మెంట్‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
తాజాగా 'మిస్టర్ మజ్ను' సినిమాని నిధి బెంగుళూర్‌లో చూసింది. అదీ కుటుంబ సభ్యులతో కలిసి, ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పేర్కొంటూ సినిమా మూడో వారంలో ఉన్నా ధియేటర్ ఆల్‌మోస్ట్ ఫుల్ అయ్యిందని పేర్కొంది నిధి అగర్వాల్. నిజానికి 'మిస్టర్ మజ్ను' బిజినెస్ దాదాపుగా క్లోజ్ అయిపోయింది. సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లోనే చాలా చోట్ల 'మిస్టర్ మజ్ను'ని లేపేశారు.
అయినా సినిమా ప్రమోషన్స్ కోసం నిధి చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. సినిమా అంచనాల్ని అందుకోలేకపోవడం నేరం కాదు, తమ సినిమాల్ని తాము ప్రమోట్ చేసుకోలేని దుస్థితిని నేరంగానే పరిగణించాలేమో. ముఖ్యంగా ప్రమోషన్ అంటేనే చీదరించుకునే కొందరు హీరోయిన్స్‌కి నిధి తీరు స్లిప్పర్ స్లాప్ లాంటిదని కొందరు అభిప్రాయపడుతున్నారు.