'ఒక మనసు' చిత్రంతో తొలిసారిగా మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది మెగా డాటర్ నిహారిక. అయితే తొలి సినిమా ఆమెకు భారీగా నిరాశను మిగిల్చింది. ఆ తర్వాత నిహారిక నుండి మరో సినిమా రాలేదు. కానీ ఈ మధ్య తమిళంలో ఓ సినిమాలో నటించింది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో నిహారిక చాలా జోవియల్‌గా కనిపించింది. అయితే ఈ సినిమా తెలుగులో విడుదల కాలేదు కానీ అది వేరే విషయం. ఇకపోతే తెలుగులో మళ్లీ నిహారిక ఎంట్రీ ఇస్తోన్న సినిమా 'హ్యాపీ వెడ్డింగ్'.
సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్నాడు. లక్ష్మణ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. టైటిల్‌లోనే ఉంది కదా, ఇదేదో పెళ్లి నేపథ్యంలో సాగే కథ అని. పెళ్లి కుదిరిన రోజు నుండీ, పెళ్లి జరిగే వరకూ హీరో, హీరోయిన్ ఇరు కుటుంబాల మధ్య సాగే పరిస్థితుల ను ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారట. తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలకు అద్దం పట్టేలా ఈ చిత్రం కథా, కథనం ఉండనుందట. అంతేకాదు, వియ్యాల వారి మధ్య జరిగే గిల్లికజ్జాలను, అలాగే ఆప్యాయతా, అనురాగాలను చాలా సరదా సరదాగా చూపించనున్నారట.
ఎన్నో ప్రతిష్ఠాత్మక చిత్రాలను సక్సెస్‌ఫుల్‌గా తెరకెక్కించిన యూవీ క్రియేషన్స్ సంస్థ, పాకెట్ సినిమా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇకపోతే, నిహారిక తొలి సినిమాలో సీరియస్‌గా, మూడీగా కనిపించి బోర్ కొట్టించేసింది. కానీ ఈ సినిమాలో ఫుల్ జోష్‌గా కనిపించనుంది. ఈ ట్రెండ్‌కి తగ్గ అమ్మాయిగా మోడ్రన్ అండ్ ట్రెడిషనల్ లుక్‌లో నిహారిక కనిపించనుంది. త్వరలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే యోచనలో చిత్ర యూనిట్ ఉంది.