బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఎపిసోడ్ తర్వాత ఒక్కసారిగా నెపోటిజంపై విమర్శలు పెరిగాయి. బంధుప్రీతి వల్లే సుశాంత్ కు అన్యాయం జరిగిందంటూ పలువురు నెటిజన్లు ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాతలపై, స్టార్ కిడ్స్ పై విరుచుకుపడుతున్నారు. ఈమధ్య టాలీవుడ్ హీరో నిఖిల్ తన అభిమానులతో లైవ్ చాట్ చసిన సమయంలో ఓ అభిమాని ఈ నెపోటిజం టాపిక్ పై ప్రశ్నించారు. అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ నిఖిల్ బంధుప్రీతి అన్నిచోట్లా ఉంటుందని చెప్పారు.
అయితే ఎవరికైనా కష్టపడితేనే ఫలితం దక్కుతుందని, కష్టపడడంతో పాటుగా టాలెంట్ ఉన్నవారే స్టార్లు అవుతారని అన్నారు. తన కెరీర్ లో ఎప్పుడూ బంధుప్రీతి కారణంగా ఇబ్బందులు ఎదురు కాలేదని స్పష్టం చేశారు. 'అర్జున్ సురవరం' ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి గారు నా గురించి మాట్లాడిన నాలుగు మాటలను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. జీవితంలో అదో స్వీట్ మెమొరీగా నిలిచిపోయిందని అన్నారు. ఇక నిఖిల్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే జీఎ2 పిక్చర్స్ బ్యానర్లో '18 పేజెస్' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కాకుండా 'కార్తికేయ 2' కూడా లైన్లో ఉంది. ఈ సినిమాకుచందు మొండేటి దర్శకుడు.