యంగ్ హీరో నిఖిల్ కాస్సేపటి క్రితం తన స్నేహితురాలు పల్లవి వర్మను పెళ్ళాడాడు. గత నెలలోనే వీరిద్దరి పెళ్ళి జరగాల్సి వుండగా, లాక్‌డౌన్ నేపథ్యంలో పెళ్ళి వాయిదా పడింది. అయితే, ప్రస్తుతం లాక్‌డౌన్ నుంచి కొన్ని సడలింపులు రావడం, దానికి తోడు ముందు ముందు మంచి ముహార్తాలు లేకపోవడంతో ఇరు కుటుంబాల పెద్దలు, ముహార్తాన్ని ఖరారు చేశారు. ఈ రోజు ఉదయం హైద్రాబాద్ శివార్లలోని నిఖిల్‌కి చెందిన ఫామ్ హౌస్‌లో అతి తక్కువ మంది బంధు మిత్రులతో ఈ వివాహ వేడుక పూర్తయ్యింది.
వివాహ వేడుక సందర్భంగా అతిథులందరూ సోషల్ డిస్టెన్స్ పాటించారు. కాగా, నిఖిల్ తాను పెళ్ళి చేసుకోబోతోన్న విషయాన్ని కొద్ది నెలల క్రితమే సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన విషయం విదితమే. నిఖిల్ భార్య పల్లవి వర్మ వృత్తి రీత్యా డాక్టర్. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో వున్నారు. వీరి ప్రేమకు పెద్దల అంగీకారం లభించడంతో పెళ్ళికి లైన్ క్లియర్ అయ్యింది. మరోపక్క, టాలీవుడ్‌లో పెళ్ళి పీటలెక్కేందుకు పలువురు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్’ సిద్ధమవుతున్నారు. హీరో నితిన్ వివాహం కూడా ఈ పాటికే జరిగిపోవాలి. లాక్‌డౌన్ నేపథ్యంలో అది వాయిదా పడింది. ఇటీవలే రానా, తన లవ్‌ని బయటపెట్టాడు. ఈ ఏడాదే రానాకి పెళ్ళి చేయనున్నట్లు రానా తండ్రి, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ ప్రకటించిన విషయం విదితమే.